Youth Meet Family After 17 Years : ఆరేళ్ల వయసులో తప్పిపోయిన బాలుడు ఆరిఫ్ ఖాన్ 23 ఏళ్ల వయసులో తల్లిదండ్రులకు దొరికాడు. 17 ఏళ్ల సుదీర్ఘ వ్యవధి తర్వాత కన్నవారి చెంతకు చేరాడు. దీంతో ఆరిఫ్ తల్లిదండ్రులు అఫ్సానా, ఎహ్సాన్ ఖాన్ భావోద్వేగానికి గురయ్యారు. తమ కుమారుడిని కళ్లారా చూసుకొని ఆనందపడిపోయారు. ఆరిఫ్ ఆచూకీని గుర్తించేందుకు శ్రమించిన హరియాణాలోని పంచకుల పోలీసు విభాగానికి చెందిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU)కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరిఫ్‌ను కుటుంబంతో కలపడంలో AHTU టీమ్ సభ్యుడైన ఎస్‌ఐ రాజేష్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
2008లో అలా తప్పిపోయాడు!
2008లో దిల్లీలోని కపాస్ హెడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక దుకాణంలో చాక్లెట్లు కొనేందుకు వెళ్లి ఆరిఫ్ ఖాన్ తప్పిపోయాడు. దీనిపై అతడి తల్లిదండ్రులు వెంటనే పోలీసుశాఖకు చెందిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU)కు ఫిర్యాదు ఇచ్చారు. దీనిపై 2008 జూన్ 12న కపాస్ హెడా పోలీస్ స్టేషన్‌లో డీడీఆర్ (DDR) నివేదికను నమోదు చేశారు. 2008 జూన్ 15న పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 363 ఐపీసీ కింద కేసు నమోదైంది. అయినా 17 ఏళ్ల పాటు ఆరిఫ్ ఆచూకీ దొరకలేదు.
కేవలం 20 రోజుల అన్వేషణతో కొలిక్కి
పంచకుల AHTU విభాగం ఎస్‌ఐ రాజేష్ కుమార్ ప్రత్యేక చొరవతో వ్యవహరించారు. కేవలం 20 రోజుల అన్వేషణతో ఆరిఫ్ ఖాన్ జాడను గుర్తించారు. ఈక్రమంలో ఆయన దిల్లీ పోలీసు విభాగానికి చెందిన జోనల్ ఇంటిగ్రేటెడ్ పోలీస్ (జిప్) నెట్‌వర్క్ నుంచి సాంకేతిక సహాయాన్ని తీసుకున్నారు. వాస్తవానికి సాధారణ విధుల్లో భాగంగానే తప్పిపోయిన పిల్లలు, వారి తల్లిదండ్రుల లిస్టును ఆయన తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆరిఫ్, ఆయన తండ్రి పేరుతో కూడిన నివేదికను ఎస్‌ఐ రాజేష్‌కు కనిపించింది. దీంతో ఆ మిస్సింగ్ కేసుతో ముడిపడిన సమస్త సమాచారాన్ని జిప్ నెట్‌వర్క్ నుంచి సేకరించారు. వెంటనే దీనిపై దిల్లీ పోలీసులను రాజేష్ సంప్రదించగా, ఆ కేసును కొట్టివేశారని తెలిపారు. అయినా ఎస్‌ఐ రాజేష్ తన మిషన్‌ను ఆపేయలేదు.
అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పించే ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల బాలల సంరక్షణ కేంద్రాలకు ఆరిఫ్ ఖాన్ వివరాలతో సందేశాలను పంపారు. ఈ సమాచారంతో ఆరిఫ్‌ను పోలిన బాలలు ఉంటే చెప్పాలని కోరారు. 2025 మార్చి 4న రాజేష్‌కు ఒక ఈమెయిల్ వచ్చింది. 2015 మార్చి 17 నుంచి ఆరిఫ్ తమ దగ్గరే ఉన్నాడంటూ రాష్ట్రంలోని సోనిపట్‌లో ఉన్న గవర్నమెంట్ నార్త్ డిఫెన్స్ హోమ్ నుంచి సందేశం అందింది. "2008 జూన్ 12న గురుగ్రామ్‌లో ఒంటరిగా తిరుగుతున్న ఆరిఫ్‌ను ఒక స్వచ్ఛంద సంస్థ రక్షించింది. అతడిని రాయ్‌లో ఉన్న బాల్‌గ్రామ్ సంస్థకు అప్పగించింది. అతడిని 2015 మార్చి 17న మా దగ్గరికి పంపారు" అని సోనిపట్‌లోని గవర్నమెంట్ నార్త్ డిఫెన్స్ హోమ్ తెలిపింది. ఆ తర్వాత ఎస్‌ఐ రాజేష్ వీడియో కాల్ చేసి ఆరిఫ్ ఖాన్‌తో మాట్లాడారు. అతడి తండ్రి పేరు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. ఆరిఫ్ సరైన సమాధానమే చెప్పాడు. తాను ఎహ్సాన్ ఖాన్ కుమారుడినని బదులిచ్చాడు. పంచకులలో తన ఇంటి దగ్గర మురికి నీటి కాలువ ఉంటుందన్నాడు. ఇంతకంటే ఏమీ గుర్తులేదని చెప్పాడు. ఈ నెల (మార్చి) 24న ఆరిఫ్ ఖాన్‌ను అతడి తల్లిదండ్రులకు ఎస్‌ఐ రాజేష్ అప్పగించారు.
మళ్లీ ప్రార్థన మొదలుపెడతా: ఆరిఫ్ తల్లి
కొడుకు తప్పిపోయినప్పటి నుంచి ఆరిఫ్ తల్లి దైవ ప్రార్థన చేయడం మానేసింది. ఎట్టకేలకు కుమారుడు ఇంటికి చేరడం వల్ల తాను దైవ ప్రార్థన మొదలుపెడతానని ఆమె వెల్లడించింది. ఈ కేసును ఛేదించిన ఎస్‌ఐ రాజేష్‌ను ఏడీజీపీ మమతా సింగ్ ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు ఆధార్ కార్డులు తయారు చేయించుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆధార్ కార్డులను అప్‌డేట్ చేయించుకోవాలన్నారు.