Supreme Court About Misleading Ads : తప్పుదారి పట్టించే ప్రకటనలు సమాజానికి చాలా హాని చేస్తాయని భారత సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మిస్లీడింగ్ యాడ్స్‌కు సంబంధించి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 'ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని' ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశించింది. 2 నెలల్లోగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమిడీస్ యాక్ట్-1954 కింద నిషేధించిన ప్రకటనలకు సంబంధించి, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని రాష్ట్రాలు రూపొందించాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన సుప్రీం కోర్ట్ ధర్మాసనం పేర్కొంది. వీటిని రెండు నెలల్లో ఏర్పాటు చేయాలని, దీని గురించి ప్రచారం కూడా కల్పించాలని స్పష్టం చేసింది.
పోలీసులకు కూడా అవగాహన కల్పించాల్సిందే!
1954 చట్టంలోని నిబంధనల అమలుపై పోలీసులకు కూడా అవగాహన కల్పించాలని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కట్టడికి సంబంధించి గతంలో పలు సూచనలు చేసిన సర్వోన్నత న్యాయస్థానం, ప్రకటనలు జారీ చేసే ముందు కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్ 1994 ప్రకారం స్వీయ ధ్రువీకరణ తీసుకోవాలని ఆదేశించింది.
తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు
ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అసత్య ప్రకటనలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వవద్దని పేర్కొంటూ ఆ సంస్థను మందలించింది. అనంతరం పతంజలి ఆయుర్వేద సంస్థ కూడా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల కట్టడి చర్యల్లో భాగంగా సుప్రీం తాజా ఆదేశాలు జారీ చేసింది.