Nambala Keshavarao Story : గెరిల్లా యుద్ధం, కొత్త రకాల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌ల (IEDs) వాడకం, బలమైన సైనిక వ్యూహాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడం, టార్గెట్‌ను పూర్తి చేయడంతో పాటు చాకచక్యంగా తప్పించుకోవడంలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావు దిట్ట. మిలిటరీ తరహా దాడులకు వ్యూహరచన చేయటంలో నక్సలైట్ ఉద్యమానికి ఆయనొక మూలస్తంభం. అలిపిరిలో చంద్రబాబుపై, దంతేవాడలో సీఆర్పీఎఫ్ జవాన్లపైనే కాకుండా ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, ఒడిశాలో జరిగిన దాదాపు అన్ని ప్రధాన మావోయిస్టు దాడుల వెనుక మాస్టర్ మైండ్ నంబాల.
మావోయిస్టు పార్టీ కార్యదర్శి నంబాళ్ల కేశవరావుకు మిలిటరీ దాడుల వ్యూహకర్తగా పేరుంది. మిలిటరీ ఆపరేషన్లలో ఆయన సిద్ధహస్తుడు. మిలిటరీ వ్యూహాల రూపకల్పన, అమలు, ఆయుధాల వ్యాపారులతో సత్సంబంధాలు నెరపడంలో ఆయన అందెవేసిన చేయిగా గుర్తింపు పొందారు. దశాబ్దకాలంపాటు కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన ఆయన గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గణపతితో పోల్చితే మావోయిస్టు పార్టీ సిద్ధాంతాల అమల్లో కఠినంగా వ్యవహరించేవారనే పేరుంది. దూకుడు స్వభావం కలిగిన కేశవరావు, ప్రతిఘటన ద్వారానే లక్ష్యం సిద్ధిస్తుందని బలంగా నమ్మేవారు. వ్యూహాత్మక దాడుల్లో దూకుడుగా ఉండే నంబాల బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించడం వేళ ఆయన ఆధ్వర్యంలో మావోయిస్టలు చేసిన కొన్ని మెరికల్లాంటి దాడుల గురించి తెలుసుకుందాం.
అలిపిరిలో చంద్రబాబుపై
2003 అక్టోబరులో అలిపిరిలో నాటి సీఎం చంద్రబాబుపై జరిగిన క్లైమోర్ మైన్స్ దాడిలో నంబాల కేశవరావు ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. చంద్రబాబు తిరుమల బ్రహ్మోత్సవాలకు హాజరయ్యేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో అలిపిరి దగ్గర మందుపాతర పేల్చడంతో చంద్రబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరిపి అప్పటి పీపుల్స్‌వార్ అగ్రనేతలు సహా 33 మందిపై కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో కొందరు నిర్దోషులుగా బయటకు రాగా మరికొందరికి శిక్ష పడింది.
- ఆంధ్రప్రదేశ్‌లోని అరకులో తెలుగుదేశం నాయకుడు కిడారి సర్వేశ్వరరావు హత్యకు నంబాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
- 2010లో దంతేవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో 74 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించారు. గస్తీకి వెళ్లి తిరిగి వస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు 2కొండల మధ్యకు వచ్చాక మావోయిస్టులు మెరుపుదాడి చేశారు. పారిపోయే అవకాశం కూడా లేకుండా నంబాల దాడికి వ్యూహ రచన చేశారు చేశారు.
- 2013 మే 25న జగదల్‌పూర్ జిల్లాలోని జీరామ్ ఘాటి వద్ద మావోయిస్టులు జరిపిన దాడిలో 27 మంది మరణించారు. ఈ దాడిలో మాజీ ఎంపీ మహేంద్ర కర్మ, కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా, మాజీ ఎమ్మెల్యే ఉదయ్ ముదలియార్, అప్పటి పీసీసీ అధ్యక్షుడు నందకుమార్ పటేల్, ఆయన కుమారుడు దినేష్ సహా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వం మృతి చెందింది. ఈ దాడి వెనుక ప్రధాన సూత్రదారి నంబాలగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
- ఈ తరహా ఘటనల సమయంలో నంబాల కేశవరావు తన పేరును ప్రకాష్ అలియాస్ కృష్ణ అలియాస్ దారపు నరసింహరెడ్డి వంటి మారు పేర్లతో కార్యకలాపాలు సాగించినట్లు సమాచారం.