Marriage Broker Murder : భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో తనకు పెళ్లి కుదిర్చిన మ్యారేజ్ బ్రోకర్‌ను కత్తితో పొడిచి చంపాడు ఓ వ్యక్తి. అక్కడితో ఆగకుండా మృతుడి ఇద్దరు కుమారులను సైతం కత్తితో గాయపరిచాడు. కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ఘటనలో నిందితుడు ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు సులేమాన్ వివాహ బ్రోకర్ గా పనిచేస్తున్నాడు. అతడు ఎనిమిది నెలల క్రితం ముస్తఫా(30)కు ఒక మహిళతో వివాహం కుదిర్చాడు. అయితే ఆ మహిళకు తన భర్త ముస్తఫాతో తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రెండు నెలల క్రితం ముస్తఫాను విడిచిపెట్టి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ముస్తఫా, మ్యారేజ్ బ్రోకర్ సులేమాన్ మధ్య విభేదాలు తలెత్తాయి.
మ్యారేజ్ బ్రోకర్‌ను నానామాటలు అని!
గురువారం రాత్రి పెళ్లిళ్ల బ్రోకర్ సులేమాన్ కు ముస్తఫా ఫోన్ చేసి అసభ్యకరమైన పదజాలంతో దూషించాడు. దీంతో మ్యారేజ్ మధ్యవర్తి తన ఇద్దరు కుమారులతో కలిసి వలచిల్లోని ముస్తఫా ఇంటికి వెళ్లాడు. అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అయినా గొడవ సద్దుమణగలేదు. ఆ తర్వాత ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ముస్తఫా వెనుక నుంచి కత్తితో సులేమాన్ మెడపై పొడిచాడు. దీంతో సులేమాన్ తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అంతటితో ఆగకుండా రోడ్డుపై ఉన్న సులేమాన్ ఇద్దరు కుమారులు రియాబ్, సియాబ్ లపై కూడా కత్తితో దాడి చేశాడు ముస్తఫా.
కాగా, స్థానికులు వెంటనే గాయపడిన ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సులేమాన్ మృతి చెందాడు. తీవ్ర గాయాలతో రియాబ్, సియాబ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబం ఫిర్యాదు ఆధారంగా ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 103(1), 109(1), 118(1), 351(2), 351(3), 352 కింద ముస్తఫాపై మంగళూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని మంగళూరు నగర పోలీస్ కమిషనర్ అనుపమ్ అగర్వాల్ తెలిపారు.