Manhole Cleaning Robots : మ్యాన్ హోల్లో దిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయిన వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే ఉంటాం. ఆ నేపథ్యంలోనే మహారాష్ట్ర సర్కార్ మంచి ఆలోచన చేసింది. కార్మికుల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 100 రోబోలను రంగంలోకి దింపేందుకు ప్రణాళిక రచించింది. ఆ విషయాన్ని మంత్రి సంజయ్ శిర్సత్ మీడియాతో మంగళవారం వెల్లడించారు.
పారిశుద్ధ్య కార్మికుల మరణాలు నివారించడంలో దేవేంద్ర ఫడణవీస్ ప్రభుత్వం విఫలమైందని ఇటీవల విమర్శలు వచ్చాయి. దీంతో కేంద్ర సామాజిక, సాధికారిత మంత్రిత్వ శాఖ ఆడిట్ నిర్వహించింది. అప్పుడే ముంబయి, పుణె సహా పలు ప్రాంతాల్లో కార్మికులను రక్షించడంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు విఫలమయ్యారని తేలింది. గత మూడేళ్లలో 18 మంది చనిపోయారని బయటపడింది.
అదే సమయంలో సర్వే చేసిన ప్రాంతాల్లో భద్రతా ప్రోటోకాల్, రక్షణ గేర్, అత్యవసర ప్రతిస్పందన విధానాలు అవసరమైనంత లేవని ఆడిట్‌లో తేలింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది. మ్యాన్‌హోల్స్‌ను శుభ్రం చేసేందుకు 27 మున్సిపల్ కార్పొరేషన్లకు 100 రోబోలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మ్యానువల్‌గా పనులు కొనసాగుతున్నాయని, దేశీయంగా తయారైన రోబోలు ఇందులో ఉపయోగిస్తున్నామని తెలిపారు. వీటి సామర్థ్యం కూడా ఎక్కువేనని అన్నారు. మురుగును శుభ్రం చేయడంతో పాటు వ్యర్థాలను వేరు చేస్తాయని చెప్పారు. తొలుత ఛత్రపతి శంభాజీనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కొత్త రోబోలతో కొన్ని రోజుల పాటు ట్రయల్ జరుగుతుందని పేర్కొన్నారు. ఫలితాలు బాగుంటే అన్ని చోట్ల రోబోలను రంగంలోకి దింపుతామని తెలిపారు.