Pandavas Built Krimchi Temple : జమ్ముకశ్మీర్ ఉధంపుర్లోని కరీమ్చి ఆలయం చూపరులను ఆకట్టుకుంటోంది. మహాభారతం కాలంనాటి ఈ దేవాలయాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. మహాభారతం కాలంలో పాండవులు ఇదే గుడి వద్ద బస చేశారని ప్రజల నమ్ముతారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు. అందుకే ఈ దేవాలయాల సముదాయాన్ని 'పాండవ ఆలయాలు' అని పిలుస్తారు.
పాండవులు నిర్మించిన ఆలయాలు
ఉధంపుర్ నుంచి 12 కి.మీ దూరంలో బిరునాల నది ఒడ్డున ఉంది కరీమ్చి ఆలయం. ఇందులో ఏడు పురాతన హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఇది భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో నడుస్తోంది. ఈ చారిత్రక గుడికి ఘనమైన చరిత్ర ఉంది. భారత పురావస్తు శాఖ ప్రకారం ఈ దేవాలయాలు క్రీ.శ. 8 నుంచి 9 శతాబ్దాలలో నిర్మితమయ్యాయి. పాండవులు వనవాసం సమయంలో ఇక్కడే బస చేశారని, అప్పుడు ఒకే రాత్రి ఏడు ఆలయాలను నిర్మించారు. ఆ తర్వాత పరమ శివుడు, ఇతర దేవుళ్లకు ఈ గుడులను అంకితం చేశారని ప్రజలు నమ్ముతారు.
ఇండో- గ్రీక్ వాస్తు శిల్పం
పూర్వకాలంలో కరిమ్చీ దేవాలయం ఉన్న ప్రాంతాన్ని కుంటినగర్గా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని రాజా కేచక్ పరిపాలించేవారు. ఆయన అనుమతితో పాండవులు కరీమ్చి దేవాలయాలను నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఇవి ఇండో- గ్రీక్ నిర్మాణ వాస్తు శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ దేవాలయాలలోని శిల్పాల్లో గ్రీక్ హస్తకళ ఉట్టిపడుతోంది.
భారీగా తరలివస్తున్న భక్తులు
భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయాలని భక్తులు, పర్యటకులు భారీగా తరలివస్తుంటారు. అయితే, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ముఖ్యమైన సాంస్కృతిక వారసత్వాన్ని పర్యటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక్కడ మెరుగైన మౌళిక సదుపాయాలను కల్పించాలని కోరుతున్నారు.
ఆలయ చరిత్ర
ఈ దేవాలయాలు 8 నుంచి 9 శతాబ్దాలలో నిర్మితమయ్యాయి. శివుడు, విష్ణువు, గణేశుడు నుంచి తమకు లభించిన ఆశీర్వాదానికి కృతజ్ఞతగా పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించి వారికే అంకితం చేశారు. ఈ ఆలయాన్ని జమ్ముకశ్మీర్ చరిత్ర, సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ప్రజలు భావిస్తారు. ఇక్కడి స్థానికులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశం కూడా.