హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తుతున్నారు. హనుమంతుడికి తమలపాకులు, ప్రసాదాలు సమర్పించి తమ కోరికలు తీర్చమని వేడుకుంటున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ ఆలయంలో మాత్రం 56 రకాల వంటకాలతో మహా థాలీని హనుమంతుడికి నైవేద్యంగా పెట్టారు.
దేశంలో పాపులర్ అయిన 56 రకాల వంటకాల థాలీ
జబల్‌పుర్‌లోని పచ్మట ఆలయంలో మూడు రోజులపాటు ఘనంగా హనుమాన్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంజనేయుడికి దేశంలో పాపులర్ అయిన 56 రకాల వంటకాల థాలీని ప్రసాదంగా పెట్టనున్నారు. అలాగే 5,000 కిలోల భారీ లడ్డూను సమర్పించనున్నారు. ఆలయ రజతోత్సవాన్ని పురస్కరించుకుని హనుమాన్ మందిర్ సేవా సమితి, మహిళా మండల్ హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నాయి.
కశ్మీర్ డ్రైఫ్రూట్స్, బనారసీ పాన్ స్పెషల్
హనుమాన్కు సమర్పించిన వాటిలో కశ్మీర్ డ్రై ఫ్రూట్స్, గుజరాత్ నుంచి ఫఫ్దా-జిలేబీ, డోక్లా, ఉత్తర్ ప్రదేశ్ నుంచి లయ్య, బనారసి పాన్, లస్సీ, బెల్ షర్బత్, బిహార్ ఫేమస్ ఫుడ్ సిగ్నేచర్ లిట్టి చోఖా వంటి పాపులర్ ఆహార పదార్ధాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల ఫేమస్ ఫుడ్‌ను స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఈ థాలీ భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచనను ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు.
మన శక్తిని మనకు గుర్తు చేసేది హనుమంతుడి బలమని జగద్గురు రాఘవ్ దేవాచార్య తెలిపారు. రాముడితో కలిసి నడవడం ద్వారా ఆంజనేయుడు తన లక్ష్యాన్ని కనుగొన్నారని వెల్లడించారు. మనం కూడా హనుమాన్ స్ఫూర్తితో నడుద్దామని చెప్పారు. మరోవైపు, హనుమాన్కు సమర్పిస్తున్న థాలీలో దేశంలోని ప్రతి ప్రదేశంలోని వంటకాలు ఉంటాయని ఆంజనేయుడి భక్తుడు శ్రద్ధ తెలిపారు. ప్రతి వస్తువును ప్రేమతో తయారు చేస్తామని అన్నారు.
కాగా, హిందువులు ఆంజనేయుడి పుట్టినరోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజున ఈ పండగను చేసుకుంటారు. అలాగే హనుమాన్ జయంతిని చైత్ర పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ శుభ సందర్భంగా భక్తులు ఉపవాసం ఉండి ఆంజనేయుడికి పూజలు చేస్తారు. హనుమాన్ మంత్రాలను జపిస్తారు. దేవుడికి నైవేద్యాలు పెట్టి భక్తి శ్రద్ధలతో ఆయనను కొలుస్తారు. ఆ తర్వాత ప్రసాదాలను ఆరగిస్తారు.