Ahmedabad Plane Crash 2025 : భారత్‌లో ఇప్పటివరకు జరిగిన విమాన ప్రమాదాల్లో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ప్రాణాలను కోల్పోయారు. తాజాగా గురువారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ చనిపోయారు. లండన్‌లో నివసిస్తున్న ఆయన కుమార్తె రాధికను కలిసేందుకు జూన్ 1నే భార్య అంజలి రూపానీతో కలిసి వెళ్లాలని విజయ్ రూపానీ భావించారు. అయితే పంజాబ్ బీజేపీ ఇంఛార్జి హోదాలో లూధియానా పశ్చిమ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికపై ఆయన పూర్తి ఫోకస్ పెట్టారు. దీంతో భార్య అంజలిని ముందుగానే లండన్‌కు పంపించేశారు. చివరకు జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్‌కు విజయ్ రూపానీ బయలుదేరగా, టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు విమాన ప్రమాదాల్లో మృతిచెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పైలట్ల తప్పిదం హోమీ బాబా విమానం క్రాష్
హోమీ జహంగీర్ బాబా భారత అణు కార్యక్రమ పితామహుడు. ఆయన మన దేశానికి చెందిన విశ్వవిఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త. 1966 జనవరి 24న హోమీ బాబా ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా 101 విమానం స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఆల్ప్స్ పర్వతాల్లో ఉన్న మోంట్ బ్లాంక్ శిఖరంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) విభాగంతో విమాన పైలట్లు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు.
సంజయ్ గాంధీ ఏరోబాటిక్స్ చేస్తుండగా
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలోనే చనిపోయారు. ఆయనకు 1976లో పైలట్ లైసెన్స్ వచ్చింది. విమానాలతో గగనతలంలో విన్యాసాలు చేసే కళను ఏరోబాటిక్స్ అంటారు. ఏరోబాటిక్స్‌లో ఎన్నో ప్రైజులను సైతం సంజయ్ గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే 1980 జూన్ 23న దిల్లీలోని సఫ్దర్ గంజ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దిల్లీ ఫ్లయింగ్ క్లబ్‌కు చెందిన విమానంలో సంజయ్ గాంధీ ఏరోబాటిక్స్ చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా కంట్రోల్ కోల్పోయారు. ఫలితంగా విమానం కూలడంతో సంజయ్ గాంధీ చనిపోయారు. అంతకుముందు 1977 మార్చిలో సంజయ్‌పై హత్యాయత్నం జరిగింది. ఎన్నికల ప్రచారం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయన కారు లక్ష్యంగా 300 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిపిన తప్పించుకున్నారు.
వాతావరణం ప్రతికూలించి మాధవ్‌రావ్ సిందియా విమానం
సీనియర్ కాంగ్రెస్ నేత మాధవ్‌రావ్ సిందియా గతంలో విమానయాన శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఈయన కూడా విమాన ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయారు. 2001 సెప్టెంబరు 30న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగే ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు మాధవ్‌రావ్ సిందియా బయలుదేరారు. అయితే, విమానం మార్గం మధ్యలో ఉండగా వాతావరణం ప్రతికూలించింది. దీంతో 10 సీటర్ ప్రైవేటు విమానం ఉత్తరప్రదేశ్‌లోని మణిపురి సమీపంలో కూలిపోవడంతో మరణించారు.
హెలికాప్టర్ కూలడంతో జీఎంసీ బాలయోగి మృతి
లోక్‌సభ మాజీ స్పీకర్, టీడీపీ నేత జీఎంసీ బాలయోగి 2002 మార్చి 3న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆయన ఒక ప్రైవేటు హెలికాప్టర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి బయలుదేరారు. అయితే కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో ఉన్న ఒక చెరువు వద్ద హెలికాప్టర్ కూలిపోవడంతో చనిపోయారు.
సైప్రియన్ సంగ్మా, మరో 9 మందికి ఏమైందంటే
ఆనాటి మేఘాలయ రాష్ట్ర మంత్రి సైప్రియన్ సంగ్మా, మరో 9 మంది పవన్ హన్స్ హెలికాప్టర్‌లో అసోంలోని గువహటి నుంచి మేఘాలయలోని షిల్లాంగ్‌కు బయలుదేరారు. షిల్లాంగ్ శివార్లలోని బారాపానీ సరస్సు సమీపంలో హెలికాప్టర్ కూలిపోయి మరణించారు. షిల్లాంగ్‌కు కేవలం 20 కి.మీ దూరంలో 2004 సెప్టెంబరు 22న ఈ ప్రమాదం జరిగింది.
సింగిల్ ఇంజిన్ విమానం కూలడంతో సౌందర్య మృతి
హీరోయిన్ సౌందర్య కూడా 2004 ఏప్రిల్ 17న జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. సింగిల్ ఇంజిన్ కలిగిన సెస్నా 180 రకం విమానంలో బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు సౌందర్య బయలుదేరారు. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. దీంతో అందులోని సౌందర్య సహా నలుగురు ప్రయాణికులు చనిపోయారు. ఆ సమయానికి సౌందర్య వయసు 32 ఏళ్లు. ఆమె 7 నెలల గర్భిణిగా ఉన్నారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్
విమాన ప్రమాదంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఓం ప్రకాశ్ జిందాల్ మరణించారు. అప్పట్లో హరియాణా రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన, 2005 మార్చి 31న మరో మంత్రి సురీందర్ సింగ్ కలిసి హెలికాప్టర్‌లో దిల్లీ నుంచి చండీగఢ్‌కు బయలుదేరారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్ సమీపంలో ఈ హెలికాప్టర్ కూలింది. ఈ ప్రమాదంలో ఓం ప్రకాశ్ జిందాల్, సురీందర్ సింగ్ చనిపోయారు.
నల్లమల అడవుల్లో మాజీ సీఎం వైఎస్సార్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. 2009 సెప్టెంబరు 2న బెల్ 430 హెలికాప్టర్‌లో ఆయన బయలుదేరారు. ఈ హెలికాప్టర్ నల్లమల అడవుల్లోకి ప్రవేశించగానే వాతావరణం ప్రతికూలించింది. దీంతో హెలికాప్టర్ అదుపుతప్పి అడవుల్లోనే కుప్పకూలింది.
అరుణాచల్ మాజీ సీఎం దోర్జీ ఖండు హెలికాప్టర్‌కూ ప్రమాదం
2011 ఏప్రిల్ 30న నాటి అరుణాచల్ ప్రదేశ్ సీఎం దోర్జీ ఖండు, మరో నలుగురు హెలికాప్టర్‌లో తవాంగ్ నుంచి ఇటానగర్‌కు బయలుదేరారు. రాష్ట్రంలోని వెస్ట్ కామెంగ్ జిల్లాలోకి ప్రవేశించగానే హెలికాప్టర్ అదుపుతప్పి కూలిపోయింది. దీంతో అందులోని వారంతా చనిపోయారు.
భారత తొలి సీడీఎస్ బిపిన్ రావత్
భారతదేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ 2021 డిసెంబరు 8న హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది హెలికాప్టర్‌లో తమిళనాడులోని సూలూర్ నుంచి వెల్లింగ్టన్‌కు బయలుదేరారు. తమిళనాడులోని కూనూర్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోయారు.
ఇంకా దొరకని బ్లాక్ బాక్స్- పోలీసుల గాలింపు చర్యలు- అసలేంటది?
విమాన ప్రమాదం: మాజీ సీఎం విజయ్ రూపానీ లక్కీ నంబర్, చనిపోయిన డేట్ రెండూ ఒక్కటే!