Plane Crash Survivor Family : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటన యావత్ దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా ఏఐ171 విమానం కూలడంతో అందులోని 242 మంది చనిపోగా, ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటికొచ్చాడు. ఆయనే విశ్వాస్ కుమార్ రమేశ్. మరణానికి మస్కా కొట్టి, అందరూ ఆశ్చర్యపోయే రీతిలో విశ్వాస్ ప్రాణాలతో బయటపడ్డారు.
ఈనేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కుటుంబీకులు శుక్రవారమే లండన్ నుంచి అహ్మదాబాద్‌కు ఫ్లైట్‌లో బయలుదేరారని జయన్ కాంతీలాల్ తెలిపాడు. శనివారం రోజు వాళ్లంతా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానున్నారని జయన్ కాంతీలాల్ చెప్పాడు. ప్రస్తుతం అహ్మదాబాద్ నగరంలోని ఒక ఆస్పత్రిలో విశ్వాస్ కుమార్ రమేశ్ చికిత్స పొందుతున్నారు. ఆయన్ను ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు పరామర్శించారు.
లండన్ నుంచి బయలుదేరిన విశ్వాస్ బంధువులు
విశ్వాస్‌ను పరామర్శించేందుకు చాలాచోట్ల నుంచి బంధువులు అహ్మదాబాద్‌కు బయలుదేరారు. శుక్రవారం ఉదయాన్నే లండన్‌లోని విశ్వాస్ ఇంటికి పెద్దఎత్తున బంధువులు చేరుకున్నారు. కుటుంబీకులు, బంధువులంతా కలిసి లండన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడి నుంచి డజను మందికిపైగా అహ్మదాబాద్ విమానం ఎక్కారు. ఆ విమానం మార్గం మధ్యలో దుబాయ్‌లో దాదాపు 7 గంటల పాటు ఆగనుంది. అనంతరం అక్కడి నుంచి విమానం నేరుగా అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. వారు శనివారం రోజు అహ్మదాబాద్‌లో దిగగానే విశ్వాస్‌ను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్తారు.
విశ్వాస్‌ను తలచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తున్నాం : జయన్ కాంతీలాల్
"విశ్వాస్, నేను వరుసకు కజిన్స్ అవుతాం. కూలిపోయిన విమానంలో విశ్వాస్ ఎలాంటి నరకాన్ని అనుభవించి ఉంటాడో మేం అర్థం చేసుకోగలం. అతడి గురించి మాటల్లో ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. విశ్వాస్ కుటుంబీకులు, బంధువులంతా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఆ విమాన ప్రమాద ఘటనే పెద్ద షాకింగ్ విషయం. మేం శనివారం మధ్యాహ్నం విశ్వాస్‌ను కలవబోతున్నాం" అని జయన్ కాంతీలాల్ ఈటీవీ భారత్‌కు తెలిపారు.
విశ్వాస్ కుమార్ రమేశ్ సోదరుడు అజయ్ మృతి
విశ్వాస్ కుమార్ రమేశ్ సోదరుడి పేరు అజయ్ కుమార్ రమేశ్. ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానంలో విశ్వాస్ సీటు పక్కనే అజయ్ సీటు ఉంది. ఈ ప్రమాదంలో అజయ్ కుమార్ రమేశ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే లక్కీగా విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడ్డారు. ఓ వైపు విశ్వాస్ ప్రాణాలు నిలిచాయనే సంతోషం మరోవైపు అజయ్ చనిపోయాడనే విషాదం వారి కుటుంబసభ్యులకు ఏకకాలంలో ఎదురయ్యాయి!