Rahul Gandhi Slams Speaker Om Birla : పార్లమెంటు సమావేశాలు అప్రజాస్వామికంగా నడుస్తున్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో మాట్లాడేందుకు తనకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆక్షేపించారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులు విధివిధానాలు పాటించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరిన తర్వాత రాహల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
స్పీకర్ తనపై వ్యాఖ్యలు చేశారని, తనకు ప్రసంగించే అవకాశం ఇవ్వకుండానే సభను వాయిదా వేశారని రాహుల్ గాంధీ చెప్పారు. గతవారం కూడా ఇలానే తనను మాట్లాడనివ్వలేదని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మాత్రం ఇది సరైన మార్గం కాదన్నారు. ఏం జరుగుతోందో తనకు తెలియడంలేదని, మాట్లాడేందుకు అనుమతి కోరినా ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వడం సంప్రదాయమని గుర్తు చేశారు. బుధవారం లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేతలతో సహా 70 మంది ఆ పార్టీ ఎంపీలు స్పీకర్‌ని కలిసి చర్చించినట్లు హస్తం పార్టీ వర్గాలు వెల్లడించాయి.
#WATCH | Delhi: Lok Sabha LoP and Congress leader Rahul Gandhi says, " i don't know what is going on...i requested him to let me speak but he (speaker) just ran away. this is no way to run the house. speaker just left and he did not let me speak...he said something… pic.twitter.com/5cszadgc3w
— ANI (@ANI) March 26, 2025
"నేను ఎప్పుడు లేచి నిలబడినా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదు. మేం చెప్పాలనుకొనే అంశాలను లేవనెత్తేందుకు మాకు అనుమతి ఇవ్వడంలేదు. నేనేమీ చేయలేదు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా కూర్చున్నా. ఏడెనిమిది రోజుల నుంచి నన్ను మాట్లాడేందుకు అనుమతించడం లేదు. ఇదో కొత్త ఎత్తుగడ. ప్రతిపక్షానికి ఇక్కడ చోటులేదు. ఇటీవల ప్రధాని కుంభమేళా గురించి మాట్లాడినప్పుడు నేను నిరుద్యోగం గురించి మాట్లాడాలనుకున్నా, కానీ మాట్లాడేందుకు అనుమతించలేదు. మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతించకపోవడం అప్రజాస్వామికం" అని రాహుల్ గాంధీ అన్నారు.
నిబంధనలు పాటించాల్సిందే!
మరోవైపు, బుధవారం సభా కార్యకలాపాల సమయంలో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, సభా గౌరవాన్ని కాపాడేందుకు నిబంధనలు పాటించాలని సభ్యులకు సూచించారు. సభలోని సభ్యులు హుందాగా వ్యవహరించాలని సూచించారు. సభ్యుల ప్రవర్తన ఈ సభ ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా లేదని అనేక సందర్భాల్లో తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ సభలో తండ్రీ కూతురు, తల్లీ కుమార్తె, భార్యా భర్తలు సభ్యులుగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రతిపక్ష నేత 349 రూల్ (సభలో సభ్యులు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిని సూచించే నిబంధన) ప్రకారం నడుచుకుంటారని తాను ఆశించినట్లు తెలిపారు.