Rajnath On Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సాయుధ దళాలు నైపుణ్యం కలిగిన సర్జన్లలా కచ్చితత్వంతో పనిచేశాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సరిహద్దు వెంబడి ఉగ్రవాద మూలాలను కచ్చితత్వం, క్రమశిక్షణతో లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పారు. ఈ మేరకు లఖ్‌నవూలోని కేఎన్ మెమోరియల్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పలు వ్యాఖ్యలు చేశారు.
"సాయుధ దళాలు నిపుణులైన వైద్యులు లేదా సర్జన్లలా వ్యవహరించాయి. ఒక సర్జన్ తన పరికరాలను వ్యాధి ఉన్న చోట కచ్చితత్వంతో ఉపయోగిస్తారు. భారత దళాలు ఉగ్రవాద మూలాలపై అదే విధంగా దాడి చేశాయి. ఇద్దరూ దేశానికి కీలకమైన మార్గాల్లో సేవ చేస్తారు. ఒకరు ఆరోగ్యాన్ని కాపాడతారు. మరకొరు జాతీయ భద్రతను కాపాడతారు. ఇద్దరూ కఠినమైన శిక్షణ పొందుతారు, తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తారు. అత్యవసర సమయాల్లో వేగంగా, కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు."
- రాజ్‌నాథ్ సింగ్
"పాకిస్థాన్ ఓటమిని అంగీకరించలేదు. భారత గడ్డపై ప్రతీకార దాడులకు ప్రయత్నించింది. పౌరులను, ప్రార్థనా స్థలాలు, దేవాలయాలు, గురుద్వారాలు, చర్చిలను లక్ష్యంగా చేసుకుంది. కానీ మన దళాలు తగిన సమాధానం ఇచ్చాయి. దాడుల సమయంలో భారత్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. పౌర ప్రాంతాలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంది. నేరస్థులను శిక్షించేటప్పుడు, అమాయకుల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా మన సైనికులు చూసుకున్నారు" అని రాజ్‌నాథ్ తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ విజయం దానికి నిదర్శనం
గత నెలలో ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని అంగీకరించినప్పుడు, ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితి కారణంగా తాను హాజరు కాగలనా లేదా అని అనుకున్నట్లు రాజ్‌నాథ్ తెలిపారు. కానీ ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత సాయుధ దళాలకు, ప్రజల స్ఫూర్తికి కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చానని తెలిపారు. "మీరు (వైద్యులు) రోగులకు చికిత్స చేస్తారు, కానీ మేం రక్షణ మంత్రిత్వ శాఖలో ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో, ఉగ్రవాదం అనే వ్యాధికి నిర్మూలన చేస్తున్నాం. ఆపరేషన్ సిందూర్ విజయం ఆ సంకల్పానికి నిదర్శనం" అని ఆయన అన్నారు.
ఆ అవసరం ఉంది!
"భారతదేశంలో 10 కోట్లకు పైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. 14 కోట్ల మంది ప్రజలు మధుమేహం అంచున ఉన్నారు. మన జీవనశైలిని నియంత్రించుకోవాల్సిన అవసరాన్ని మనం అర్థం చేసుకోవాలి. సమతుల్య జీవనశైలిని అవలంబించడం ద్వారా మనం పోరాడగల అనేక వ్యాధులు ఉన్నాయి. వైద్యులు ఆ పని చేయగలరు" అని రాజ్‌నాథ్ తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రతి ఒక్కరూ మంచి జీవనశైలిని అవలంబించాలని చెప్పారు.
ఆయుష్మాన్ పథకంతో 80 కోట్లకు మందికి పైగా ప్రయోజనం పొందారని రాజ్‌నాథ్ తెలిపారు. "ఆ పథకం కారణంగా ప్రజలు తమ జేబుల్లో నుంచి చికిత్స కోసం చేసే పెట్టే ఖర్చు నేడు 62 శాతం నుంచి 38 శాతానికి తగ్గింది. 2014కి ముందు, దేశంలో కేవలం 387 వైద్య కళాశాలలు ఉండేవి, 2024 నాటికి అవి 780కి పెరిగాయి. రాష్ట్రంలో ఆరోగ్య సేవలను బలోపేతం చేయడానికి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అద్భుతమైన కృషి చేసింది" అంటూ రాజ్‌నాథ్ ప్రశంసించారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే- పిక్చర్ అబీ బాకీ హై: రాజ్‌నాథ్
ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ వణికింది!: రాజ్‌నాథ్ సింగ్