Kidney Stones Risk Shocking Facts : ప్రస్తుత రోజుల్లో మూత్రపిండాలు, పిత్తాశయంలో రాళ్ల సమస్యలు సర్వసాధారణంగా మారాయి. గాలి, నేలలో ఉండే కోబాల్ట్, క్రోమియంల కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయని పరిశోధకులు కనిపెట్టారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి చాలా నెలలు లేదా సంవత్సరాల సమయం పడుతుంది. అధిక ఆక్సలేట్ లేదా తక్కువ కాల్షియం ఉన్న ఆహారాన్ని తినడం వల్ల కూడా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతుంటాయని తెలిపారు. తాజాగా దిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన పరిశోధనల్లో ఈ అంశాలపై మరింత క్లారిటీ వచ్చింది. ఆ వివరాలను తెలుసుకుందాం.
క్రోమియంతో ముప్పును నివారించే దిశగా!
కోబాల్ట్ , క్రోమియంను అనేక ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తారు. వాటి వల్ల గాలి, నేల కలుషితమవుతాయి. క్రోమియం ఉనికి ఎక్కువగా ఉండే ప్రదేశాలలో నివసించే వారికి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. క్రోమియం ఉత్పత్తుల కారణంగా, మనిషి మూత్రపిండాలలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుందని దిల్లీ ఎయిమ్స్‌లో పరిశోధనలో గుర్తించారు. కిడ్నీలో రాళ్ల సమస్యకు భవిష్యత్తులో మరింత మెరుగైన చికిత్సా విధానాలను రూపొందించడానికి ఈ అధ్యయన నివేదిక దోహదపడుతుంది. గాలి, నేలలో కోబాల్ట్, క్రోమియం లాంటి కాలుష్య కారకాలు ఉన్న ప్రదేశాల కోసం ప్రత్యేక వ్యూహాలను రూపొందించడంలో ఈ రీసెర్చ్ రిపోర్ట్‌లోని సమాచారం సహాయపడుతుంది. ఇటీవలే దిల్లీ ఎయిమ్స్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పరిశోధకులు ఈ అధ్యయన నివేదికను విడుదల చేశారు.
రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్ల శాంపిల్స్‌తో!
అధ్యయనంలో భాగంగా మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న పలువురు రోగుల నుంచి రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్ల శాంపిల్స్‌ను సేకరించారు. ఆయా రోగుల రక్తం, మూత్రం, కిడ్నీ రాళ్లలో ఏయే మూలకాలు ఎంత మోతాదులో ఉన్నాయనేది పరిశోధకులు పోల్చి చూశారు. కిడ్నీలో రాళ్లు కలిగిన వారి నుంచి ఈ మూడు రకాల సమాచారాన్ని ఏకకాలంలో సేకరించి రీసెర్చ్ చేయడం ఇదే తొలిసారి అని సైంటిస్టులు తెలిపారు. దీనివల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి దారితీసిన ప్రధాన కారకాన్ని గుర్తించే వీలుంటుందని పేర్కొన్నారు. ఈ పరిశోధనలో ఎయిమ్స్‌లోని యూరాలజీ విభాగం, అనాటమీ విభాగం, లేబొరేటరీ మెడిసిన్ విభాగానికి చెందిన డాక్టర్ ఛబ్రా స్వేషా, డాక్టర్ సేథ్ అమ్లేష్, డాక్టర్ అహ్మదుల్లా షరీఫ్, డాక్టర్ జావేద్ అహ్సాన్ ఖాద్రీ, డాక్టర్ శ్యామ్ ప్రకాష్, డాక్టర్ కుమార్ సంజయ్ భాగమయ్యారు.
30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధారణం
రీసెర్చ్‌లో పాల్గొన్న దిల్లీ ఎయిమ్స్ పరిశోధకుల ప్రకారం, "ప్రతి 10 మందిలో ఒకరు తమ జీవితకాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ సమస్య 30 నుంచి 40 ఏళ్లలోపు వారిలో సర్వసాధారణంగా ఉండొచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు వస్తే నడుము దిగువ భాగంలో, ఉదరంలో లేదా ఉదరంలోని ఒక వైపున నొప్పిగా అనిపిస్తుంది. ఈ నొప్పి నడుము నుంచి చంకల వరకు వ్యాపించినట్లు అనిపిస్తుంది. ఈ నొప్పి కొన్నిసార్లు తేలిగ్గా, మరికొన్ని సార్లు మధ్యస్తంగా, ఇంకొన్నిసార్లు తీవ్రంగా ఉంటుంది.
కిడ్నీలో రాళ్లు ఇలా ఏర్పడతాయి!
"మానవ మూత్రంలో ఖనిజాలు, ఆమ్లాలు, ఇతర పదార్థాలన్నీ కలిసి ఉంటాయి. ఇందులో క్యాల్షియం, సోడియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ ఉంటాయి. మనం నీళ్లు తాగినప్పుడు, అవి శరీరం నుంచి మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి" అని సైంటిస్టులు వివరించారు. మనం తక్కువ నీరు తాగడం వల్ల కాల్షియం, సోడియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి పదార్థ కణాల మోతాదు మూత్రంలో పెరిగిపోతుంది. తగినంత ద్రవం లేకపోవడం వల్ల, ఆ కణాలన్నీ కలిసి అతుక్కోవడం ప్రారంభిస్తాయి. ఇలా అతుక్కున్న కణ భాగాలే కిడ్నీలలో రాళ్లుగా ఏర్పడతాయి.