మగ శిశువు కడుపులో 'పిండం'- మెదడు, గుండె తప్ప అన్ని భాగాలు- ఎందుకు ఏర్పడింది? ఎలా గుర్తించారు?
45 నిమిషాలు సర్జరీ చేసి తొలగించిన కేఎంసీఆర్ఐ వైద్య నిపుణులు-ఇది ప్రపంచంలోనే అరుదైన వైద్య కేసు అని వెల్లడించిన డాక్టర్లు

Published : October 9, 2025 at 4:55 PM IST
Fetus in Baby Boy : 'గర్భస్థ పిండం' అనేది గర్భం దాల్చిన మహిళల కడుపులో ఉంటుంది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా అప్పుడే పుట్టిన ఓ మగ శిశువు కడుపులోనూ ఉండటాన్ని చూసి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఎట్టకేలకు ఆ నవజాత శిశువుకు సర్జరీ చేసి గర్భస్థ పిండాన్ని తొలగించారు. ఇంతకీ ఆ పిండం ఎలా ఉంది? అది మగ శిశువు కడుపులో ఎలా ఏర్పడింది? పిండాన్ని తొలగించే సర్జరీని ఎలా చేశారు? ఒకవేళ దాన్ని తొలగించకుంటే శిశువుకు వయసు పెరిగే కొద్దీ ఏయే సమస్యలు వచ్చేవి? ఈకథనంలో తెలుసుకుందాం.
అల్ట్రా సౌండ్ స్కాన్- ఎంఆర్‌ఐ స్కాన్- ల్యాపరోస్కోపీ
కర్ణాటకలోని కుంద్గోల్ పట్టణానికి చెందిన ఓ మహిళకు సెప్టెంబరు 23న డెలివరీ జరిగింది. హుబ్బళ్లిలో ఉన్న కర్ణాటక మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కేఎంసీఆర్ఐ - KMCRI)లో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ వెంటనే శిశువుకు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అల్ట్రా సౌండ్ స్కాన్ చేయగా, శిశువు శరీరంలో ఒక పిండం ఉందని తేలింది. తదుపరిగా ఎంఆర్‌ఐ స్కాన్ నిర్వహించగా, ఈవిషయం నిర్ధారణ అయింది. శిశువు శరీరంలోని ఏ భాగంలో పిండం ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి తదుపరిగా ల్యాపరోస్కోపీ నిర్వహించారు. దీంతో అది ఉన్న నిర్దిష్ట ప్రదేశం, భాగంపై వైద్యులకు క్లారిటీ వచ్చింది. అనంతరం ఈ సమాచారాన్ని నవజాత శిశువు తల్లిదండ్రులకు తెలియజేశారు. వారి అంగీకారం మేరకు పసికందుకు ఓపెన్ సర్జరీ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ పిండం ఎలా ఉందో తెలుసా?
జన్మించిన 14 రోజుల తర్వాత (అక్టోబరు 6న) ఆ శిశువుకు వైద్య నిపుణులు ఓపెన్ సర్జరీ నిర్వహించారు. కేఎంసీఆర్ఐ ఆస్పత్రికి చెందిన పిల్లల వైద్య విభాగం సూపరింటెండెంట్, సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎస్.రాజశేఖర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర్ హసాబి, డాక్టర్ చేతన్, డాక్టర్ శరణ్‌లతో కూడిన వైద్యుల టీమ్ 45 నిమిషాల పాటు ఈ సర్జరీని నిర్వహించింది. శిశువు శరీరంలో నుంచి పిండాన్ని తొలగించారు. 250 గ్రాముల నుంచి 500 గ్రాముల బరువున్న ఈ పిండాన్ని చూసి వైద్యుల టీమ్ ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆ పిండానికి ప్రాణం లేకున్నా, పూర్తి ఫిట్ స్థితిలో ఉంది. దానికి మెదడు, గుండె లేవు. కానీ వెన్నుపాము, చర్మం, కాళ్లు, చేతులు, పేగులు ఉన్నాయి. ఈ పిండాన్ని కేఎంసీఆర్ఐ వైద్య కళాశాలలోని వ్యాధి విజ్ఞాన శాస్త్రం (పాథాలజీ) విభాగానికి అప్పగించారు. ఆ విభాగంలోని వైద్య విద్యార్థులు దీనిపై పరిశోధనలు చేయనున్నారు.
పిండాన్ని తొలగించకపోయి ఉంటే అలా జరిగేది
శస్త్రచికిత్స చేయించుకున్న శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని కేఎంసీఆర్ఐ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర్ హసాబి వెల్లడించారు. ఆ శిశువు కడుపులోని పిండాన్ని తొలగించకపోయి ఉంటే, భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండేవన్నారు. శిశువు పెరిగేకొద్దీ, కడుపులోని పిండం కూడా పెరిగి ఉండేదని ఆయన తెలిపారు. ప్రత్యేకించి శిశువు పొట్టలోని పేగుల్లో గ్యాంగ్రీన్ వచ్చే అవకాశం పెరిగేదని చెప్పారు. గ్యాంగ్రీన్ (gangrene) అంటే తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా రక్త ప్రసరణ లోపించి శరీర కణజాలం చనిపోతుంది.
ఇది ప్రపంచంలోనే అరుదైన వైద్య కేసుల్లో ఒకటి
''ఇది ప్రపంచంలోనే అరుదైన వైద్య కేసుల్లో ఒకటి. ఆ శిశువుకు శస్త్రచికిత్స చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కేఎంసీఆర్‌ఐలో పనిచేస్తున్నందు వల్లే నాకు ఈ అవకాశం లభించింది. ఈ కేసు మా ఆస్పత్రికి వైద్య రంగంలో మంచి పేరు సాధించి పెట్టింది'' అని సర్జరీ టీమ్‌కు సారథ్యం వహించిన కేఎంసీఆర్‌ఐ ఆస్పత్రి పిల్లల వైద్య విభాగం సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.రాజశేఖర్ తెలిపారు.
శిశువు కడుపులో పిండం ఎందుకు ఏర్పడింది?
పురుషుడి వీర్య కణాలు, మహిళ అండాల కలయిక వల్ల జైగోట్ ఏర్పడుతుంది. జైగోట్ అనేది తల్లి కడుపులో కొత్తగా ఏర్పడే ఏకకణ జీవం. అది ప్రాణాలతో ఉంటుంది. తల్లి కడుపులోని ఫల్లోపియన్ ట్యూబ్ భాగం నుంచి యుటెరస్ భాగం వైపుగా జైగోట్ జారుకుంటూ వెళ్తుంది. ఈక్రమంలో జైగోట్ 2 వేర్వేరు కణాలుగా విభజన చెందుతుంది. ఈ ప్రక్రియ జరిగే వేళ, ఒక జైగోట్‌కు మరో జైగోట్ అతుక్కొని పోవడం వల్ల నవజాత శిశువులో కడుపులో పిండం ఏర్పడుతుందని వైద్య నిపుణులు తెలిపారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా జన్మించే ప్రతీ 5 లక్షల మంది పిల్లల్లో ఒకే ఒకరిలో ఇలా పిండం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి 200 కేసులే వెలుగులోకి వచ్చాయి.

