Covid Cases In Kerala : ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి వళ్లీ వచ్చింది. ఇప్పటి వరకు చాప కింద నీరులా ఉన్న కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మే నెలలోనే కేరళలో 182 కొవిడ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అత్యధికంగా కొట్టాయం జిల్లాలో 57 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఎర్నాకుళంలో 34, తిరువనంతపురంలో 30 కేసులు ఉన్నట్లు చెప్పారు. కేరళలో కొవిడ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలతో బాధపడేవారు తప్పసరిగా మాస్క్ ధరించాలని వీణా జార్జ్ అన్నారు.
మరోవైపు మహారాష్ట్రలో జనవరి నుంచి ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల్లో ఇద్దరు మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరణించిన వారిలో ఒకరికి క్యాన్సర్ ఉన్నట్లు పేర్కొంది. జనవరి నుంచి మొత్తం 6,066 స్వాబ్ టెస్ట్‌లు చేయగా, 106 కేసులు పాజిటివ్ తెలినట్లు చెప్పింది. వీరిలో 101 మంది ముంబయికి చెందిన వారు కాగా, మిగిలిన వారు పుణె, థానే, కొల్హాపుర్ చెందినవారుగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 52 కేసులు పాజిటివ్ కేసులు ఉన్నట్లు, వారిలో 16మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా ఆరోగ్యశాఖ చెప్పింది.
మే 19నాటికి దేశవ్యాప్తంగా 257 కొవిడ్ కేసులు ఉన్నట్లు ఇటీవల కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఈ కొవిడ్ కేసులన్నీ దాదాపుగా తేలికపాటివేనని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. సింగపూర్, హాంకాంగ్‌లో కొవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల అప్రమత్తమయ్యామని పేర్కొంది. సింగపూర్, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్ పెరుగుదల తీవ్రంగా ఉంది. వారంలోనే వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి.
పెరుగుదలకు కారణమేంటి?
ఆసియా దేశాల్లో కొత్తగా నమోదు అవుతున్న కేసుల వ్యాప్తికి జేఎన్.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణమని అధికారులు చెబుతున్నారు. జేఎన్.1 ఉపరకాలైన ఎల్‌ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉన్నట్లు చెబుతున్నారు. మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ కేసులు ఇవేనని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత కొవిడ్-19 వ్యాక్సిన్‌లో జేఎన్.1 వేరియంట్‌ను ఉపయోగించినట్లు వెల్లడించింది.