Jyoti Malhotra Father Cried : పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ట్రావెలింగ్‌లో భాగంగా ఆమె కలిసిన వాళ్లందరినీ పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కుమార్తె కేసు వాదించడానికి తన దగ్గర డబ్బులు లేవని వాపోయాడు జ్యోతి తండ్రి హరీష్ మల్హోత్రా. తాను పేదవాడినని, న్యాయవాది ఫీజు కూడా చెల్లించలేకపోతున్నానని తెలిపాడు. జ్యోతి అరెస్టు అయినప్పటి నుంచి ఆమెతో మాట్లాడలేకపోయానని వెల్లడించాడు. ఈ క్రమంలో మీడియా ముందే ఏడ్చేశాడు.
జ్యోతి అరెస్ట్ అయినప్పటి నుంచి హరీష్ మల్హోత్రా ఆరోగ్యం క్షీణిస్తోందని తెలుస్తోంది. అతడు గత మూడు రోజులకు మందులు వాడుతున్నాడని సమాచారం. కాగా, తన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇప్పటివరకు తిరిగి పొందలేదని హరీష్ చెప్పాడు. అంతేకాకుండా జ్యోతి వద్ద ఉన్న డైరీ గురించి కూడా తనకు ఎలాంటి సమాచారం లేదన్నాడు.
మరోవైపు, జ్యోతి మల్హోత్రా కేసులో హరియాణాలోని హిసార్ పోలీసులు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. జ్యోతి మల్హోత్రా కొంతమంది పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్- PIOs లతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. కొంత సమాచారాన్ని మార్పిడి చేసుకుందని చెప్పారు.
ఎవరీ హర్కిరాత్?
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, నిందితురాలి నుంచి 3 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్‌తో పాటు మరికొన్ని ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే కురక్షేత్రకు చెందిన వీసా సేవలు అందించే హర్కిరాత్ అనే వ్యక్తిని కూడా పోలీసులు విచారించారు. అతడి దగ్గరి నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరి దగ్గరి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలాక్ట్రానిక్ పరికరాలను దర్యాప్తు కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి వీటిని విశ్లేషిస్తున్నారు. హిసార్ పోలీసులతో పాటు కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా నిందితురాలు జ్యోతిని విచారించాయి.
నిర్ధరణ లేకుండా ఏం రాయొద్దు?
హిసార్ పోలీసులు ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిందితులను ఎప్పటికప్పుడు విచారిస్తున్నాయి. కాగా, దర్యాప్తు చేస్తున్న సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో కూడా అనేక నిరాధారమైన వార్తలు ప్రచారం అవుతున్నాయని హిసార్ పోలీసులు తెలిపారు. ఆధారం లేని వార్తలు దర్యాప్తును ప్రభావితం చేయడమే కాకుండా, అది జాతీయ భద్రతను కూడా ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో వ్యాపించిన కొన్ని పుకార్లను ఖండించారు. ఈ మేరకు కొన్ని విషయాల్లో స్పష్టత ఇచ్చారు.
పోలీసులు చెప్పిన విషయాలివే!
- నిందితులకు సైనిక రక్షణ లేదా వ్యూహాత్మక సమాచారం అందుబాటులో ఉందనేందుకు ఇంకా ఎటువంటి ఆధారాలు లభించలేదు.
- పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి దర్యాప్తు చేస్తున్నారు, అక్కడ విశ్లేషణ కొనసాగుతోంది. ఇప్పటివరకు విశ్లేషణ ఫలితాన్ని హిసార్ పోలీసులకు అందజేయలేదు. నిందితుడి వాట్సాప్ చాట్ గురించి ఇప్పుడే ఏమీ వ్యాఖ్యానించలేము.
- నిందితుడి డైరీలోని పేజీలు అని బహిరంగంగా ప్రదర్శిస్తున్నప్పటికీ, అవి పోలీసుల వద్ద లేవు.
- నిందితుడికి చెందిన 4 బ్యాంకు ఖాతాల లోతైన విశ్లేషణ కొనసాగుతోంది. డబ్బు లావాదేవీకి సంబంధించి ఇప్పుడే ఎటువంటి కామెంట్స్ చేయలేము.
- నిందితురాలు- PIOలు కాదని తెలిసి కూడా కొంతమంది వ్యక్తులతో సంప్రదింపులు జరిపిందని స్పష్టంగా తెలుస్తోంది. కానీ ఇప్పటివరకు నిందితురాలికి ఏదైనా ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి అని రుజువు చేసే ఆధారం ఏదీ లభించలేదు. ఉగ్రవాద ఘటనలలో నిందితురాలి ప్రమేయం గురించి ఇంకా ఎటువంటి సమాచారం లభించలేదు.
- నిందితుడు ఏదైనా PIO తో వివాహం చేసుకోవడం, వేరే మతంలోకి మారడం మొదలైన వాటికి సంబంధించి ఇంకా ఎటువంటి ఆధారాలు లభించలేదు.
- ఈ దర్యాప్తు జాతీయ భద్రతకు సంబంధించినది. వార్తలను రిపోర్ట్ చేయడంలో అన్ని అన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాలు సంయమనం పాటించాలని పోలీసులు కోరారు. అధికారిక నిర్ధరణ తర్వాతే వార్తలను ప్రసారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
పూర్తి స్పృహలోనే గూఢచర్యం చేసింది : పోలీసులు
జ్యోతి మల్హోత్రా పూర్తి స్పృహతోనే పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని హరియాణా పోలీసులు వెల్లడించారు. అయితే, టెర్రరిస్టులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అంతేగాక, సాయుధ దళాల గురించి కూడా ఆమెకు అవగాహన లేదని హిస్సార్ ఎస్పీ తెలిపారు.
హిందూ ఆలయాలపై పాక్ స్పై జ్యోతి కుట్ర చేసిందా?
లవర్ కోసం కన్న కొడుకును చంపిన కసాయి తల్లి- దారంతో గొంతు నులిమి ఆపై!