Kamal Haasan Rajya Sabha : మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ హాసన్ పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేయనుందని సమాచారం. దీంతో త్వరలో రాజ్యసభకు కమల్ వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
2018లో మక్కల్ నీది మయ్యం పార్టీని మొదలుపెట్టిన కమల్ హాసన్, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు. ఆ తర్వాత, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన మక్కల్ నీది మైయం, పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో బీజీపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్‌పై పోటీ చేసిన కమల్ హాసన్ స్వల్ప తేడాతో ఓడిపోయారు.
అయితే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ప్రకటించారు కమల్. ఒప్పందంలో భాగంగా రాష్ట్రంలోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో ఎంఎన్‌ఎం తరఫున ప్రచారం కూడా చేశారు. కాగా, అప్పుడు 2025 ఎగువసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది.
ఇప్పుడు జూన్ 2025 నాటికి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం, నడి నివాసానికి రాష్ట్రమంత్రి శేఖర్ బాబు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా రాజ్యసభకు నామినేట్ చేయడం గురించి గతంలో ఇచ్చిన హామీపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కమల్‌ను రాజ్యసభను నామినేట్ చేసే నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.
అయితే స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రమోషన్స్‌లో నిమగ్నమై ఉన్న కమల్ హాసన్, మూవీ విడుదలైన తర్వాత మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని సమాచారం. అలా జూన్‌లో థగ్ లైఫ్, జూలైలో ఎంపీగా ఎన్నికవ్వనున్నారని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
రాష్ట్ర పర్యటనకు ప్రణాళిక
అదే సమయంలో జూలై తర్వాత కమల్ హాసన్ 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళనాడు అంతటా చురుగ్గా పర్యటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ చోట్ల పలు సమావేశాలను నిర్వహించనున్నారని తెలుస్తోంది. కాగా, కమల్ లైనప్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కల్కి మూవీ సీక్వెల్ సహా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ మూవీలోనే ఆయనది కీలకపాత్ర. మరి అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో కమల్ ఎలా బిజీగా మారుతారో చూడాలి.