JNU Suspends MoU With Turkey University : పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఈ సమయంలోనే పాకిస్థాన్‌కు తుర్కియే మద్దతు ఇవ్వడంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే మన ట్రావెల్ ఏజెన్సీలు తుర్కియేకు ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు దిల్లీలోని ప్రఖ్యాత జేఎన్‌యూ తాజాగా ప్రకటించింది.
కాగా.. దేశ భద్రత దృష్ట్యా ఇనొను యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఎంవోయూను ప్రస్తుతం నిలిపేస్తున్నట్లు జేఎన్‌యూ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో అధ్యాపకులు, విద్యార్థుల మార్పిడికి సంబంధించిన ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇరుదేశాల యూనివర్సిటీల మధ్య ఇటీవల మూడేళ్లకు గాను విద్యాపరమైన ఒప్పందం కుదరింది. ఇక ఇనొను యూనివర్సిటీ తుర్కియేలోని మలట్యాలో ఉంది. విభిన్న సాంస్కృతిక పరిశోధనలు, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఇటీవల జేఎన్‌యూ, ఇనొను యూనివర్సిటీల మధ్య ఎంవోయూ కుదిరింది. తాజా పరిణామాల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేస్తూ జేఎన్‌యూ ఈ నిర్ణయం తీసుకుంది.
Due to National Security considerations, the MoU between JNU and Inonu University, Türkiye stands suspended until further notice.
— Jawaharlal Nehru University (JNU) (@JNU_official_50) May 14, 2025
JNU stands with the Nation. #NationFirst @rashtrapatibhvn @VPIndia @narendramodi @PMOIndia @AmitShah @DrSJaishankar @MEAIndia @EduMinOfIndia
కాగా, కొన్నేళ్ల క్రితం తుర్కియేలో భూకంపం వచ్చింది. ఆ సమయంలో భారతదేశం తక్షణం స్పందించి, అన్నివిధాలా సాయం చేసింది. కానీ పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సిందూర్‌తో భారత్ దాడి చేసింది. ఈ సమయంలోనే పాక్‌కు తుర్కియే బాంబు డ్రోనులను అందించింది. మిలిటరీ సిబ్బందినీ పంపించింది. దీంతో ఆగ్రహించిన ప్రజలు బాయ్‌కాట్ తుర్కియే పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా తుర్కియే వస్తువులు, పర్యాటకాన్ని బహిష్కరించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. తుర్కియే ఆన్‌లైన్ బుకింగ్‌లను నిలిపివేయగా, మరోవైపు మహారాష్ట్ర పుణెలోని వ్యాపారులు తుర్కియే నుంచి వచ్చే యాపిల్స్‌ను పూర్తిగా బహిష్కరించారు. ఆ దేశం నుంచి యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడం మానేశారు. ఫలితంగా పుణెలోని మార్కెట్ యార్డుల్లో తుర్కియే యాపిల్స్ కనుమరుగయ్యాయి. ఇక రానున్న రోజుల్లో తుర్కియేతో భారత వాణిజ్య సంబంధాలు కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.