ISRO Chairman Narayanan : ఈ ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ద్వారా మరో 13 రాకెట్లను ప్రయోగించనున్నట్లు చైర్మన్ వి. నారాయణన్ పేర్కొన్నారు. సోమవారం బెంగళూరుకు బయలుదేరే ముందు చెన్నై విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎస్‌ఎల్‌వీ సీ-61 రాకెట్ ప్రయోగం విఫలం కావడం చాలా దురదృష్టకరమన్నారు.
జాతీయ భద్రత, విపత్తు నిర్వహణ, వాతావరణ అంచనా, అటవీ పర్యవేక్షణ, పట్టణ ప్రణాళిక, వ్యవసాయం వంటి ప్రాజెక్టుల కోసం ఇస్రో ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-61 రాకెట్ విఫలమైనట్లు చెప్పారు. అంతరిక్షంలోకి భారత్ ప్రయోగించిన 101వ రాకెట్ ఇదని వివరించారు. అలాగే, విఫలమైన రాకెట్ గురించి ఆయన క్లుప్తంగా చెప్పారు.
పీఎస్‌ఎల్‌వీ సీ-61 అనేది నాలుగు దశల రాకెట్ అని నారాయణన్ అన్నారు. నాలుగు దశలు సరిగ్గా పనిచేస్తేనే రాకెట్‌ను విజయవంతం అవుతుందన్నారు. మొదటి రెండు దశలు విజయవంతంగా పనిచేసినప్పటికీ, మూడో దశలో ఒక చిన్న లోపం ఏర్పడినట్లు వివరించారు.
మూడో దశలో సాంకేతిక సమస్య కారణంగా రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించలేకపోయినట్లు చెప్పారు. అయితే లోపం ఎలా జరిగిందో తెలియదని, రాకెట్ వైఫల్యాన్ని పరిశోధించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రయోగించనున్న 13 రాకెట్ల ప్రయోగాల్లో ఈ లోపం జరగకుంటా చూసుకుంటామన్నారు.