200 Years Old Scary Mansion : మొఘల్ కాలం, బ్రిటీష్ కాలం నాటి ఎన్నో చారిత్రక భవనాలు నేటికీ మనదేశంలో చెక్కుచెదరకుండా నిలిచి ఉన్నాయి. ఇలాంటి భవనాలు, నిర్మాణాలకు పురావస్తు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కోవకు చెందిన ఓ భారీ భవనం మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఉంది. దాన్ని ‘ఫూటీ కోఠి’ అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఇదొక అసంపూర్తి భవనం. దీన్ని హోల్కర్ రాజవంశీకుల కాలంలో నిర్మించారు. ఇందులో 365 గదులున్నా ఏ ఒక్క దానిపైనా పైకప్పు లేదు. శాపగ్రస్త భవనం అయినందు వల్లే, ఇది పైకప్పుకు నోచుకోలేదని స్థానికులు చెబుతుంటారు. తగిన నిర్వహణ లేక, పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంతో ఫూటీ కోఠి శిథిలావస్థకు చేరుకుంది.
హోల్కర్ రాజ్య సైన్యం కోసమే ఈ నిర్మాణం
ఫూటీ కోఠిని 19వ శతాబ్దం చివర్లో మహారాజా శివాజీ రావు హోల్కర్ నిర్మించారు. ఇది ఇందౌర్ నగరం పశ్చిమ ప్రాంతంలో ఉంది. ప్రాచీన భారతీయ, బ్రిటీష్ శైలుల కలయికతో నిర్మించిన ఈ భవనం చూడటానికి ఎర్రకోటను తలపిస్తుంది. హోల్కర్ రాజ్య సైనికులు, సైనిక బలగాలను అత్యంత సురక్షితంగా ఉంచేందుకు ఫూటీ కోఠిని నిర్మించారు. అందుకే పైకప్పు లేకపోయినా ఒక గొప్ప భవనంలా కనిపించేలా దీన్ని మహారాజా శివాజీ రావు నిర్మించారు. ఇటీవలి కాలంలో ఫూటీ కోఠి గ్రౌండ్ ఫ్లోర్‌లో 18 వివిధ దేవాలయాలను నిర్మించారు. ప్రస్తుతం వీటిని సర్వజన్ కళ్యాణ్ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అయినా ఈ భవనం పరిధిలోని చాలాభాగం ఇంకా నిర్జనంగానే మిగిలిపోయి ఉంది.

ఈ కారణం వల్లే 200 ఏళ్లుగా పైకప్పుకు నోచుకోలేదు
ఫూటీ కోఠిని నిర్మించేందుకు నల్ల రాయి, సున్నంతో పాటు పురాతన నిర్మాణ సామగ్రిని ఉపయోగించారు. పైకప్పు నిర్మాణం కోసం ఏదైనా ఆధారం అవసరం. అయితే ఎలాంటి ఆధారం లేకుండా ఫూటీ కోఠికి వేలాడే పైకప్పును నిర్మించాలని భావించారు. ఈమేరకు భవనంలోని పలు ప్రాంతాల్లో పైకప్పు నిర్మాణ పనులను అప్పట్లో మొదలుపెట్టారు. అయితే ఈ సమాచారం బ్రిటీష్ పాలకులకు చేరింది. దీంతో వారు వచ్చి పనులను అడ్డుకున్నారు. ఫూటీ కోఠిలోని కొంత భాగాన్ని ధ్వంసం చేశారు. ఈ కారణం వల్లే గత 200 సంవత్సరాలుగా ఈ అద్భుతమైన ఫూటీ కోఠి అసంపూర్తి నిర్మాణంగా నిలిచిపోయింది.

భవనంలో కొంత భాగం భూగర్భంలోనే
ఫూటీ కోఠి చెప్పుకోవడానికి రెండు అంతస్తుల్లో ఉన్నప్పటికీ పైకప్పు మాత్రం లేదు. దీని స్తంభాలు సాదా వృత్తాకారంగా, పైభాగంలో చతురస్రాకారంలో ఉంటాయి. వాటిపై భారాన్ని మోసే కీచక బొమ్మలు ఉన్నాయి. స్తంభాలపై పూల బొమ్మల తోరణాలతో అలంకరణ ఉంది. ఈ భవనానికి ఉత్తరం, పశ్చిమం దిక్కుల్లో వరండాలు ఉన్నాయి. ఫూటీ కోఠిలోని భూగర్భంలో, ఉపరితలంపై మొత్తం 365 గదులు ఉన్నాయి. నల్ల రాళ్లను కలిపి పెద్దసంఖ్యలో గదులను నిర్మించారు. ఈ భవనంలోని గదుల్లో ఎక్కువ భాగం భూగర్భంలోనే ఉన్నాయని అంటారు. ఫూటీ కోఠిలోనే సైనికులు దాక్కునేందుకు భూగర్భ గుహ ఉంది. ఈ భవనం కింది భాగం చివర్లో దుర్గా మాత మందిరం కూడా ఉంది. చిమ్మచీకటిగా ఉండటం వల్ల దానిలోకి ఎవరూ వెళ్లరు.

దయ్యాలున్న ప్రదేశంగా భావిస్తున్నారు : సదాశివ్ కౌతుభ్, చరిత్రకారుడు
ఫూటీ కోఠి గురించి చరిత్రకారుడు సదాశివ్ కౌతుభ్ ‘ఈటీవీ భారత్’కు వివరించారు. ‘‘ప్రాచీన కాలంలో రాజులు, చక్రవర్తులు ఇలా వేట స్థలాలను నిర్మించుకునే వారు. వేట కోసం వాళ్లు తమ కుటుంబాలతో ఇలాంటి భవనాల్లోకి వచ్చి ఉండేవారు. ఫూటీ కోఠి విషయానికొస్తే మహారాజా హోల్కర్ దీన్ని సైనిక భద్రతా ప్రయోజనాల కోసం నిర్మించి ఉండొచ్చు. ఈ అద్భుతమైన భవనం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. ఇది శిథిలావస్థకు చేరుకుంటోంది. దీనివల్ల స్థానిక ప్రజలు ఫూటీ కోఠిని దయ్యాలున్న ప్రదేశంగా భావిస్తున్నారు. వాళ్లు లోపలికి వెళ్లడానికి కూడా భయపడుతున్నారు’’ అని సదాశివ్ కౌతుభ్ పేర్కొన్నారు.

ఒకే కుటుంబంలోని 50మందికి 24 వేళ్లు- పెళ్లిలు, ఉద్యోగాల కోసం ఇబ్బందులు!