IMD Monsoon Forecast : భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం చల్లటి కబురు చెప్పింది. మన దేశంలో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే ఎక్కువే వర్షపాతం నమోదవుతుందని పేర్కొంటూ అంచనాలను విడుదల చేసింది. ఈదఫా మొత్తం వర్షాకాలం సీజన్‌లో 'ఎల్ నినో' తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. మంగళవారం దిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను ఐఎండీ చీఫ్ మృత్యుంజయ్ మోహపాత్ర వెల్లడించారు. "జూన్ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు నెలల పాటు వర్షాకాలం ఉంటుంది. ఈ వ్యవధిలో సాధారణం కంటే ఎక్కువే వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీర్ఘకాలిక వర్షపాత సగటు 87 సెంటీమీటర్లు. ఇందులో దాదాపు 105 శాతం మేర సగటు వర్షపాతం ఈసారి వానాకాలం సీజన్‌లో కురవొచ్చు" అని ఆయన తెలిపారు. "ఎల్ నినో తరహా వాతావరణ పరిస్థితులు ఏర్పడితే వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షాలు పడతాయి. ఈసారి భారత్‌లో ఆ తరహా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదు" అని మృత్యుంజయ్ మోహపాత్ర చెప్పారు.
జూన్ వరకు వడగాలుల దడ
ఇప్పటికే దేశంలోని చాలా ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. వాటి వల్ల ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల (ఏప్రిల్) నుంచి జూన్ వరకు వడగాలుల తీవ్రత క్రమంగా పెరిగే అవకాశం ఉందని ఐఎండీ నిపుణులు అంటున్నారు. దీనివల్ల ప్రభావిత ప్రాంతాల్లోని విద్యుత్ గ్రిడ్‌ల పనితీరుకు ఆటంకం కలగొచ్చు. నీటి కొరత సమస్య ఏర్పడొచ్చు. భారత వ్యవసాయ రంగానికి వర్షపాతమే ప్రధాన ఆధారం.
రైతన్నలకు పండుగ లాంటి వార్త
నేటికీ భారత్‌లోని దాదాపు 42.3 శాతం మంది జనాభాకు ప్రధాన జీవనాధారం వ్యవసాయ రంగమే. మనదేశ స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ)లో 18.2 శాతం వాటా వ్యవసాయ రంగం నుంచే సమకూరుతోంది. దేశంలోని పంట సాగు భూముల్లో దాదాపు 52 శాతం వర్షాధార ప్రాంతాల్లోనే ఉన్నాయి. వర్షాలు కురిస్తే రిజర్వాయర్లు నిండుతాయి. వాటి నుంచే ప్రజలకు తాగునీటిని సప్లై చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు జలాలను పంపిణీ చేస్తారు. అందుకే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురుస్తుంది అనేది రైతన్నలకు, దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద శుభవార్త. ఆందోళనకర అంశం ఏమిటంటే, మన దేశంలో ఏటా వర్షాకాలం(నాలుగు నెలల కాలం)లో వర్షాలు కురిసే రోజులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇక ఇదే సమయంలో అతి తక్కువ రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే ఘటనలు పెరుగుతున్నాయి. ఫలితంగా వరద బీభత్సం ఏర్పడి ఎంతో నష్టం వాటిల్లుతోంది. వాతావరణ మార్పుల వల్లే ఈ వైపరీత్యాలు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయోధ్య గర్భగుడి శిఖరంపై 161 అడుగుల కలశం- శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు
ఒకేసారి 50వేల మందితో భోజనాలు- ఉజ్జయినిలో వరల్డ్ రికార్డ్- 20ఏళ్ల నుంచి ఇలానే!