India on Trump Trade : వాణిజ్యాన్ని ఉపయోగించి భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో అమెరికా ప్రతినిధులతో భారత ప్రతినిధులు ఫోన్లో మాట్లాడారని ఆ సమయంలో వాణిజ్యం గురించి ఎలాంటి ప్రస్తావన రాలేదని తెలిపాయి
' ఆపరేషన్ సిందూర్ గురించి ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో విడతల వారీగా చర్చలు జరిపారు. మే 9న ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ప్రకటన తర్వాత ప్రధాని మోదీతో జేడీ వాన్స్ ఫోన్లో మాట్లాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో మే 8,10వ తేదీల్లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాట్లాడారు. అదేవిధంగా మే 10న అజిత్ డోభాల్‌తోనూ మాట్లాడారు. అయితే ఈ చర్చల్లో ఎక్కడ కూడా ఇరుదేశాల మధ్య వాణిజ్య అంశం ప్రస్తావనకు రాలేదు. కాల్పుల విరమణకు, వాణిజ్యానికి సంబంధం లేదు' అని అధికార వర్గాలు చెప్పాయి. అంతకుముందు కూడా కాల్పుల విరమణపై ట్రంప్ తొలుత ప్రకటన చేశారు. అప్పుడు కూడా భారత్ ఏ మాత్రం ట్రంప్ పాత్రను ప్రస్తావించలేదు.
భారత్- పాక్‌ల మధ్య కాల్పుల విరమణకు మా యంత్రాంగం మధ్యవర్తిత్వం వహించిందని ట్రంప్ అన్నారు. అనేక అణ్వాయుధాలను కలిగి ఉన్న రెండు దేశాల మధ్య ప్రమాదకర పోరాటం జరుగుతున్న సమయంలో అమెరికా యంత్రాంగం జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించిందని ట్రంప్ వివరించారు. ఉద్రిక్తతలకు ముగింపు పలికితేనే వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకుంటామని, లేకపోతే ఎటువంటి వాణిజ్యం చేయబోమని స్పష్టం చేసినట్లు ట్రంప్ అన్నారు. దీంతో ఆ దేశాలు సానుకూలంగా స్పందించాయంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని భారత్ తాజాగా ఖండించింది.