Hormuz Strait India : అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా చేపడుతున్న దాడులతో ఇరాన్, ప్రపంచ చమురు మార్కెట్‌కు జీవనాడిగా ఉన్న హర్మూజ్ జలసంధిని మూసేవేసేలా అడుగులు వేస్తున్నట్లు కనపడుతోంది. ఇరాన్ పార్లమెంటు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం నేషనల్ సెక్యురిటీ కౌన్సిల్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. అయితే హర్మూజ్ మూసివేస్తే భారత్‌పై ప్రభావం పడుతుందనే వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పురీ స్పందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గత రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా సరఫరాలను వేర్వేరు మార్గాలకు వికేంద్రీకరించామని వెల్లడించారు.
అయితే భారత్ సరఫరాల్లో ఎక్కువ భాగం ఇప్పుడు హర్మూజ్ జలసంధి ద్వారా రావడం లేదని స్పష్టం చేశారు. చమురు మార్కెటింగ్ కంపెనీలకు అనేక వారాల పాటు సరఫరాలు ఉండటంతో పాటు వివిధ మార్గాల నుంచి ఇంధన సరఫరాలు అందుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పౌరులకు ఇంధన సరఫరాలో స్థిరత్వాన్ని సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం-ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి హర్మూజ్. దీనిలో ఓ చోట అత్యంత ఇరుకుగా కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ చమురు అవసరాల్లో 20 శాతం హర్మూజ్ ద్వారానే రవాణా అవుతోంది. ఖతార్, ఇరాక్, ఇరాన్ దేశాల నుంచి వివిధ దేశాలకు ఈ మార్గంలోనే రోజుకు దాదాపు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతోంది.
ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ వినియోగంలో ఇది 21 శాతానికి సమానం! అయితే ప్రపంచ దేశాలు వినియోగించే ఎల్‌ఎన్‌జీ(ద్రవరూప సహజ వాయువు)లోకూడా 20% ఇక్కడ నుంచే సరఫరా జరుగుతోంది. కానీ భారత్ అవసరాల్లో 85% ముడి చమురు సౌదీ, ఇరాక్, యూఏఈ నుంచి రవాణా అవుతోంది. ఖతార్ నుంచి ఎల్‌ఎన్‌జీ కూడా ఆ మార్గంలోనే వస్తుంది. అయితే హర్మూజ్ జల సంధిని ఇరాన్ ఒకవేళ మూసేస్తే భారత్‌లో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెల్లువడ్డాయి. దీంతో కేంద్రమంత్రి స్పందించి స్పష్టతనిచ్చారు.