10 Years Tech Pioneer : కేరళలోని మలప్పురం నగరానికి చెందిన పదేళ్ల బాలుడు అదిత్ కంప్యూటర్ నైపుణ్యాలను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. నీలంబూర్ పరంబలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న అదిత్ సమాచార సాంకేతిక ప్రపంచంలో అద్భుత విజయాలను సాధించాడు. కంప్యూటర్ టెక్నాలజీలో అతడు సాధించిన అసాధారణ నైపుణ్యాలను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకీ ఇదెలా సాధ్యమైంది ? తోటి విద్యార్థులను అదిత్ ఎలా మించిపోయాడు ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
అమ్మమ్మ కొనిచ్చిన ల్యాప్‌టాప్‌తో!
కరోనా మహమ్మారి ప్రబలుతున్న సమయంలో పాఠశాలలన్నీ ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించాయి. ఆ టైంలో అదిత్‌కు వాళ్ల అమ్మమ్మ సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్‌ను కొనిచ్చింది. ఆ ల్యాప్‌టాప్ చేతికొచ్చాక అదిత్ ఆలోచనలు మారాయి. గేమ్స్ డెవలప్‌మెంట్ గురించి యూట్యూబ్‌లో చూసిన ఒక వీడియో అతడికి గేమింగ్ రంగంపై ఆసక్తిని పెంచింది. దీంతో గేమ్స్ డెవలప్ చేయాలని అదిత్ సంకల్పించుకున్నాడు. ఇందుకు అవసరమైన కోడింగ్, డిజైనింగ్ నైపుణ్యాలను నేర్చుకున్నాడు. అదిత్ ఎంతో శ్రమించి పదేళ్ల వయసులోనే రెండు గేమ్‌లను అభివృద్ధి చేశాడు. వాటిలో ఒకటి 3D గేమ్, మరొకటి 2D గేమ్. అతడు 3D గేమ్‌ను తయారు చేయడానికి రెండు రోజుల సమయాన్ని తీసుకున్నాడు. 2D గేమ్‌ను కేవలం సగం రోజులోనే సిద్ధం చేశాడు.

పాఠశాల వెబ్‌సైట్- సొంత యూట్యూబ్ ఛానల్
యూట్యూబ్‌లో వీడియోలు చూసి అదిత్ వెబ్ డిజైనింగ్ కూడా నేర్చుకున్నాడు. ఈ స్కిల్‌తో నేరుగా తన స్కూల్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను డిజైన్ చేశాడు. ఇందుకోసం అతడికి రెండు నెలలకుపైగా సమయం పట్టింది. ఎథికల్ హ్యాకింగ్ కోర్సులు కూడా అదిత్ నేర్చుకున్నాడు. తన జ్ఞానాన్ని ఇతరులతో పంచుకునే లక్ష్యంతో ఆదిత్2025(Adith2025) పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. ఈ ఛానల్ వేదికగా అతడు కోడింగ్, గేమ్ డెవలప్‌మెంట్ చిట్కాలను అందిస్తున్నాడు. ఈసారి వేసవి సెలవుల్లో తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత మెరుగైన కంటెంట్‌ను తేవాలని అదిత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనకు గేమ్ డెవలపర్, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని ఉందని అదిత్ అంటున్నాడు. గూగుల్‌కు పోటీగా సరికొత్త సాంకేతిక సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఉందని చెప్పుకొచ్చాడు.
