SC On President Bills : రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. బిల్లుల గడువును నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఈ తరహా తీర్పునివ్వడం ఇదే తొలిసారి.
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఆమోదించకుండా నెలల తరబడి తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఏప్రిల్ 8న స్పష్టంచేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులో కీలకమైన అంశాలను పొందుపరిచింది. 415 పేజీలున్న తీర్పు ప్రతిని శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆ తీర్పులో జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం కీలక సూచనలు చేసింది. పరిశీలన కోసం గవర్నర్లు పంపిన బిల్లులపై 3 నెలల్లోపే రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఒక వేళ మూడు నెలల వ్యవధి దాటి ఏదైనా ఆలస్యం జరిగితే అందుకు గల కారణాలను సంబంధిత రాష్ట్రాలకు తెలపాలని ధర్మాసనం తేల్చిచెప్పింది. రాష్ట్రాలు సైతం గవర్నర్లు, రాష్ట్రపతికి సహకరించాలని, బిల్లులపై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించింది.
రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించకుండా నిలిపి ఉంచితే వారి చర్యలపై న్యాయసమీక్షకు అవకాశం ఉందని ధర్మాసనం తెలిపింది. బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్లు తీసుకోవాల్సిన అత్యధిక గడువు ఒక నెల మాత్రమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. మంత్రి మండలి సిఫార్సు లేకుండా బిల్లును గవర్నర్ ఆమోదించకుండా నిలిపేస్తే ఆ బిల్లును 3 నెలల్లోగా శాసనసభకు తిరిగి పంపాలని సూచించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం బిల్లులకు ఆమోదం తెలపడానికి గవర్నర్లకు నిర్దిష్ట కాలపరిమితి లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే స్పష్టమైన కాలపరిమితి లేదని రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోకుండా ఇష్టమొచ్చనట్లు వ్యవహరించడానికి కూడా వీలు లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ తీర్పు ప్రతిని అన్ని రాష్ట్రాల హైకోర్టులకు, ప్రధాన కార్యదర్శులకు పంపించాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది.
రాజ్యాంగ చరిత్రలో తొలిసారి!
సుప్రీం ఇచ్చిన ఈ తీర్పుపై నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న 10 చట్టాలను నోటిఫై చేసి గెజిట్ నొటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యాంగ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ ఆర్‌ఎన్ రవికి పంపించింది. అయితే వాటిపై ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాటిని తనవద్దే ఉంచేసుకుంటున్నారని ప్రభుత్వం ఆరోపణలు గుప్పించింది. అనంతరం ఇదే విషయంపై 2023లో సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. బిల్లుల్ని సమ్మతించకపోవడం, పునఃపరిశీలించాలని సూచిస్తూ వెనక్కి కూడా పంపడం లేదని సుప్రీంకు తమిళనాడు నివేదించింది. తిరిగి వచ్చిన బిల్లులను రెండోసారి ఆమోదించినా ఆయన తీరు మార లేదంటూ పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఇటీవల సంచనలన తీర్పు ఇచ్చింది.
బిల్లులను పెండింగ్‌లో ఉంచడం రాజ్యాంగ విరుద్ధం.. తమిళనాడు గవర్నర్‌కు సుప్రీం మందలింపు
ముదిరిన వివాదం.. గవర్నర్‌పై సీఎం తీవ్ర ఆరోపణలు.. ముర్ముకు ఫిర్యాదు!