Bhopal Woman Delivers Four Babies : ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చిన అరుదైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జరిగింది. ఈ నవజాత శిశువుల్లో ఇద్దరు మగపిల్లలుకాగా, మరో ఇద్దరు ఆడపిల్లలు. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
'భోపాల్ చరిత్రలో ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు బిడ్డలకు జన్మనిచ్చారు. ఇది ఒక ప్రత్యేకమైన కేసు. సదరు మహిళ మొదటిసారి చెకప్ కోసం వచ్చినప్పుడు ఆల్ట్రాసోనోగ్రఫీ చేశాం. అప్పుడు ఆమె గర్భంలో నాలుగు పిండాలు ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది. ఆమెకు ఏడో నెలలో ప్రసవం నొప్పులు వచ్చాయి. దీనితో ఆమెను ఆసుపత్రిలోని అత్యవసర వార్డ్‌లో ఉంచాం. ఇలాంటి పరిస్థితుల్లో తల్లి, కడుపులో ఉన్న బిడ్డల యెడల ప్రత్యేక శ్రద్ధ అవసరం. అయితే ఆమెకు నెలలు నిండకుండానే నలుగురు బిడ్డలు జన్మించారు. వాస్తవానికి గర్భం దాల్చిన ఏడో నెలలో సి-సెక్షన్ ద్వారా ఆమెకు పురుడు పోయడం జరిగింది. ప్రస్తుతం నవజాత శిశువుల బరువు 800 గ్రాముల నుంచి 1 కేజీ మధ్యలో ఉంది. సాధారణంగా ఓ శిశివు ఉండాల్సిన బరువు కంటే ఇది చాలా తక్కువ. అందుకే ఆ బిడ్డలందరినీ ప్రస్తుతం ఐసీయూలో ఉంచాం. అయితే వీరిలో ఇద్దరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. అందుకే వారిని వార్మర్ రూమ్ (వెచ్చని గది)లో ఉంచాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం' అని కైలాష్‌నాథ్ కట్జు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ స్మితా సక్సేనా తెలిపారు.
అరుదైన ఘట్టం!
ఒకేసారి ముగ్గురు పిల్లలు పుట్టడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కానీ ఒకే కాన్పులో నలుగురు పట్టడం చాలా అరుదైన ఘటన అని వైద్యులు చెబుతున్నారు.