Amit Shah About Tamil Nadu Politics : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు రాష్ట్రాల్లోనూ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం రోజు తమిళనాడులోని మదురైలో అమిత్‌షా పర్యటించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి బీజేపీ ఆఫీస్ బేరర్లతో ఏర్పాటు చేసిన 'కార్యకర్త సమ్మేళన్'లో ఆయన ప్రసంగించారు. మధురైను మార్పునకు ప్రతీకగా నిలిచే నగరంగా అమిత్‌షా అభివర్ణించారు. తమిళనాడులోని అధికార పీఠం నుంచి డీఎంకేను గద్దె దించడానికి బీజేపీ 'కార్యకర్త సమ్మేళన్'తో నాంది పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - అన్నా డీఎంకే కలిసి ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని తమిళనాడులో ఏర్పాటు చేస్తాయని కేంద్ర హోంమంత్రి విశ్వాసం వెలిబుచ్చారు. డీఎంకే సర్కారు పాలనలో 100 శాతం ఫెయిలైందని, దాన్ని ప్రజలు ఓడించడం ఖాయమన్నారు. 2026లో పశ్చిమ బెంగాల్‌లోనూ ఎన్‌డీఏ సర్కారే ఏర్పడుతుందని అమిత్‌షా అన్నారు.
#WATCH | Madurai, Tamil Nadu | Union Home Minister Amit Shah says, " in 2025, we formed the government in delhi, in 2026, the bjp-nda will form the government in west bengal and tamil nadu..." pic.twitter.com/P1WQUd7Mh3
— ANI (@ANI) June 8, 2025
'టాస్మాక్' లో భారీ స్కాం
"తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (టాస్మాక్)లో భారీ స్కాం జరిగింది. కనీసం ఈ స్కాం విలువతో సమానమైన నిధులనైనా ఖర్చు చేసి రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో 2 క్లాస్‌రూంలను నిర్మించి ఉండాల్సింది" అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. డీఎంకే అవినీతిమయ పాలన వల్ల రాష్ట్రంలోని పేదలు, మహిళలు, పిల్లల జీవితాలు ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయన్నారు. స్టాలిన్ సర్కారును గద్దె దింపి తీరుతామనే ప్రతిజ్ఞను తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నెరవేర్చారో చెప్పాలని సీఎం స్టాలిన్‌ను అమిత్‌షా ప్రశ్నించారు. గత పదేళ్లలో తమిళనాడుకు కేంద్ర సర్కారు రూ.6.80 లక్షల కోట్లు ఇచ్చినప్పటికీ, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని సీఎం స్టాలిన్ అడుగుతుండటం విడ్డూరంగా ఉందన్నారు.
మీనాక్షి ఆలయంలో అమిత్‌షా పూజలు
అంతకంటే ముందు అమిత్‌షా అధ్యక్షతన బీజేపీ తమిళనాడు రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం జరిగింది. మధురైలోని ప్రఖ్యాత మీనాక్షి ఆలయంలో అమిత్‌షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం క్రితమే డీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా డీఎంకే పలు తీర్మానాలు చేసింది. ఈనేపథ్యంలో ఆదివారం రోజు తమిళనాడులో అమిత్‌షా పర్యటించడం, బీజేపీ ఆఫీస్ బేరర్లలో ఉత్తేజం నింపేలా ప్రసంగించడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనూ తమిళనాడులో కేంద్ర హోంమంత్రి పర్యటించారు. బీజేపీ- అన్నా డీఎంకే మధ్య మరోసారి పొత్తు కుదిరిందని అప్పట్లో ఆయన ప్రకటించారు.
బీజేపీ - అన్నా డీఎంకేలది సరైన జోడీ : నైనార్ నాగేంద్రన్, తమిళనాడు బీజేపీ చీఫ్
మధురైలో జరిగిన బీజేపీ 'కార్యకర్త సమ్మేళన్'లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ డీఎంకేపై ధ్వజమెత్తారు. డీఎంకే పాలనా వైఫల్యం వల్లే తమిళనాడులో శాంతిభద్రతలు గాడితప్పాయన్నారు. పశ్చిమ కొంగు ప్రాంతం పరిధిలోని పలు గ్రామాల్లో వృద్ధుల టార్గెటెడ్ హత్యలను పోలీసులు ఆపలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అన్నా డీఎంకేతో కలిసికట్టుగా ముందుకు సాగేందుకు నిబద్ధత, అంకితభావాలతో సమాయత్తం కావాలని బీజేపీ శ్రేణులకు నైనార్ నాగేంద్రన్ పిలుపునిచ్చారు. బీజేపీ - అన్నా డీఎంకే పార్టీలది రాజకీయంగా సరైన జోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్‌డీఏ కూటమి నుంచి వీలైనంత ఎక్కువ మందిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడమే తన లక్ష్యమని నాగేంద్రన్ వెల్లడించారు. "కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భారతదేశపు ఉక్కు మనిషి. ఆయన మరో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటివారు" అని నైనార్ నాగేంద్రన్ కొనియాడారు.
ఏకైక సంకల్పంతో ముందుకు సాగండి : అన్నామలై
అధికార డీఎంకేను గద్దె దింపాలనే ఏకైక సంకల్పంతో ముందుకు సాగాలని బీజేపీ శ్రేణులను తమిళనాడు బీజేపీ ముఖ్య నేత కె.అన్నామలై కోరారు. ఈ సంకల్పం సిద్ధించే వరకు అలుపెరగకుండా పోరాడాలన్నారు.
'ఉగ్రవాదాన్ని పోత్సహిస్తే ప్రమోషన్లు- లేదంటే బేడీలు- పాక్లో అంతే!'
అయోధ్య రామ్ దర్బార్ను దర్శించుకోవాలా? ఫ్రీ పాస్ కోసం గురించి తెలుసా?