IMD Rain Alert : భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల రికార్డు స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదు అవుతుంటే, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే రానున్న మూడు రోజుల పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిస్తే, మరోవైపు వేడి గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఐఎండీ అంచనా ప్రకారం మే 12 నుంచి 15 వరకు ఉరుములు మెరుపులతో పాటు బలమైన గాలులు వీస్తాయి. ఇవి కొన్ని ప్రాంతాల్లో ఉపశమనం కలిగించేలా ఉంటే, మరికొన్ని చోట్ల ఆందోళనకరంగా ఉంటాయని ఐఎండీ పేర్కొంది. దేశరాజధాని దిల్లీలో రానున్న ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని సూచించింది. తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది. విభిన్న వాతావరణ మార్పులు కారణంగా మే 11-12 తేదీల్లో జమ్మూకశ్మీర్, లద్ధాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది.
ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు
ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ముఖ్యంగా అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
ఆ రాష్ట్రాల్లో వేడి గాలులు
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. బంగాల్, బిహార్, ఝార్ఖండ్ తూర్పు ఉత్తరప్రదేశ్‌లో వేడి గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక ఉత్తరప్రదేశ్‌లోని 20 జిల్లాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ఐఎండీ. ఆదివారం ఆగ్రాలో గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో హోర్డింగ్స్, చెట్లు కూలిపోవడం వంటివి జరిగాయి.
IMD చల్లని కబురు- మే 27 నాటికి నైరుతి రుతుపవనాలు
'మే' లో మండే ఎండలు- కానీ వర్షాలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని IMD వెల్లడి