IIT Kharagpur SMART ROBOT : పంటను కాపాడుకునే క్రమంలో రైతులు, పొలంలో వివిధ రకాల రసాయనాలు చల్లి తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆరోగ్య దృష్ట్యా ఐఐటీ ఖరగ్పూర్ ప్రొఫెసర్ల బృందం విన్నూత ఆలోచన చేసింది. వ్యవసాయ రంగంలో మనుషులకు బదులు స్మార్ట్ రోబో వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఐఐటీ ఖరగ్పుర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ప్రొఫెసర్ల బృందం దీన్ని అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ దిలీప్ కుమార్ ప్రతిహార్ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రోబో పనితీరు, దాని సామర్థ్యాల గురించి తెలిపారు. అవేంటో ఇపుడు చూద్దాం.

డ్రోన్ కంటే మెరుగ్గా
'ఇది వరకు డ్రోన్ల ద్వారా మందుల పిచికారి జరిగేది. కానీ, అందులో లోపం ఉండడం వల్ల ఈ రోబో వ్యవస్థను ప్రవేశపెట్టాము. సాధారణంగా డ్రోన్ల ద్వారా వ్యవసాయ పిచికారి చేయడం వల్ల, రసాయనాలు మొక్క పూర్తి అంచువరకు వెళ్లవు. తెగుళ్ల నివారణలో దాని పనివిధానం అంతగా ఉండకపోగా డ్రోన్ ద్వారా పిచికారి చేయడం వల్ల మొక్క ఆకులు పాడయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి గత కొద్ది సంవత్సరాలుగా దీనిపై అనేక పరిశోధనలు చేస్తున్నాం. అందులో భాగంగా రోబో ద్వారా పిచికారి చేయాలని ఆలోచిన వచ్చింది' అని ప్రొఫెసర్ దిలీప్ కుమార్ తెలిపారు.

గుంతల్లో కూడా సులువుగా
ఈ రోబో తెగుళ్లలో ఉన్న సమస్యలను గుర్తించి దానిని పరిష్కరిస్తుందని ప్రొఫెసర్ దిలీప్ కుమార్ చెప్పారు. ఇది 'సెమిఆటోమెటిక్ ట్రాక్డ్ మొబైల్ మానిపులేటర్' వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుందన్నారు. రోబో పనితీరు గురించి అందరికీ ప్రయోగపూర్వకంగా వివరించారు. అలాగే దీనికి 'ఫామ్బోట్' అని నామకరణం కూడా చేశారు. ఇది మొక్కపై ఉన్న తెగుళ్లను గుర్తించి మందు పిచికారి చేసి వాటిని నివారిస్తుందన్నారు. ఇవి బురద, గుంతలు వంటి ప్రాంతాల్లో కూడా సులువుగా పనిచేస్తుందన్నారు. ఇందులో ఉండే ఆటోమెటిక్ కెమెరా, వ్యవసాయ క్షేత్రాన్ని ఇరువైపులా స్కాన్ చేసి పనిచేయడం ప్రారంభిస్తుందన్నారు. ఇది వివిధ అప్లికేషన్లతో పనిచేస్తుందని తెలిపారు.

వ్యాధులను గుర్తించడమే కాకుండా
వివిధ రకాల మొక్కలకు అనేకరకాల వ్యాధులు వస్తాయి. బంగాళాదుంప తెగులు, మామిడి మొగ్గ పురుగు సమస్య వంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే, నేల ఆమ్లత్వంలో వైవిధ్యం కారణంగా బియ్యం, గోధుమలలో బ్యాక్టీరియా ఏర్పడవచ్చు. కంప్యూటర్ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ రోబో వ్యవస్థ వ్యవసాయంలో రంగంలో సంభవించే వివిధ రకాల వ్యాధులను గుర్తించి వాటిని నివారించగలదని ఆయన పేర్కొన్నారు. ఈ రోబోలకు అయ్యే ఖర్చులను ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ భరిస్తుందని ప్రొఫెసర్ తెలిపారు.