Venom Maps Of Russell Viper: రక్తపింజర కాటేస్తే బతకడం దాదాపు అసాధ్యం. అయితే ఇప్పుడు దాన్ని సుసాధ్యం చేయడంలో కీలక ముందడుగు పడింది. భారతదేశంలో విస్తృతంగా కనిపించే ప్రాణాంతకమైన పాము రస్సెల్ వైపర్ (రక్త పింజరి) విష లక్షణాలను అంచనా వేయడంలో పురోగతి సాధించారు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- బెంగళూరు పరిశోధకులు. రస్సెల్ వైపర్ విష లక్షణాలను అంచనా వేయడానికి సాయపడే వీనమ్ మ్యాప్స్ (పాము విషం లక్షణాలు, వర్గీకరణ)ను అభివృద్ధి చేశారు. పాము కాటుకు గురైన రోగులకు సరైన చికిత్సను అందించడానికి వైద్యులకు వీనమ్ మ్యాప్స్ సహాయపడతాయని చెప్పారు. ఈ పరిశోధనకు సంబంధించిన కథనం 'పీఎల్ఓఎస్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్' జర్నల్‌లో ప్రచురితమైంది.
వినోమ్ మ్యాపింగ్ అంటే ఏమిటి?
వినోమ్ మ్యాపింగ్ అంటే వివిధ జంతువుల నుంచి, ప్రధానంగా పాముల విషానికి సంబంధించిన పనితీరును అర్థం చేసుకోవడానికి - విషం భాగాలు, లక్షణాలను విశ్లేషించి, వర్గీకరించే ప్రక్రియ. ఈ ప్రక్రియలో విషంలో ఉన్న వివిధ ప్రోటీన్లు, పెప్టైడ్‌లు, ఇతర అణువులను గుర్తిస్తారు. ఈ అణువులు శరీరంతో ఎలా ఇంటరాక్ట్ అయితాయో పరిశోధకులు అర్థం చేసుకుంటారు.
'రస్సెల్ వైపర్స్ వల్ల అధిక మరణాలు'
"రస్సెల్ వైపర్ ప్రపంచంలోనే వైద్యపరంగా అత్యంత ముఖ్యమైన పాము జాతి. ఇది కాటేయడం వల్ల ఇతర పాము కాట్ల కంటే ఎక్కువ మంది మరణిస్తున్నాడు. అలాగే దివ్యాంగులు అవుతున్నారు. ఫలితంగా రస్సెల్ వైపర్ విషం కాంపోజిషన్, శక్తిని తెలుసుకోవాలి. పాము విష ప్రభావాలు వాతావరణం, ఆహారం లభ్యత వంటి అంశాలతో ప్రభావితమవుతాయి. మా ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో రస్సెల్ వైపర్ విషం గురించి కీలక విషయాలు తెలిశాయి. రస్సెల్ వైపర్ విషం ప్రభావం చూపడంలో ఉష్ణోగ్రత, తేమ, వర్షపాతం వంటి వాతావరణ పరిస్థితుల పాత్రను మేము మొదటిసారిగా హైలైట్ చేస్తున్నాం. "అని సెంటర్ ఫర్ ఎకలాజికల్ సైన్సెస్, ఐఐఎస్సీ బెంగళూరు ప్రొఫెసర్ కార్తీక్ సునగర్ తెలిపారు.
115 పాములపై పరిశోధన
రక్తపింజరి విషంపై అధ్యయనం జరిపేందుకు పరిశోధకులు దేశవ్యాప్తంగా ఉన్న 34 ప్రదేశాల నుంచి 115 పాముల నుంచి విష నమూనాలను సేకరించారు. ప్రోటీన్లు, ఫాస్ఫోలిపిడ్లు, అమైనో ఆమ్లాలను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్లతో సహా అన్నింటినీ పరీక్షించారు. ఆ సమయంలో స్థానిక వాతావరణ పరిస్థితులను అంచనా వేశారు. భారతదేశంలోని పొడి ప్రాంతాలలోని పాములలో ప్రోటీన్ల విచ్ఛిన్నం ఎక్కువగా ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ డేటాను ఉపయోగించి భారతదేశంలోని రస్సెల్స్ వైపర్స్ కోసం వీనమ్ మ్యాప్స్‌ను అభివృద్ధి చేశారు. రక్తపింజరి కాటుకు నిర్దిష్ట యాంటీబాడీస్ అభివృద్ధి చేయడంలో వీనమ్ మ్యాప్స్ సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు.
పాముకాటుకు విరుగుడు
పాముకాటుకు విరుగుడు కనిపెట్టడంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు ఇటీవలే విజయవంతమయ్యారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలో విడుదలయ్యే ప్రాణాంతకర విష పదార్థాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. ఈ కీలక పరిశోధనలో అమెరికాకు చెందిన స్కిప్స్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యులు అయ్యారు.