Supreme Court On ED : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈడీకి ప్రాథమిక హక్కులు ఉంటే- ప్రజల హక్కుల గురించి కూడా ఆలోచించాలని అసహనం వ్యక్తం చేసింది. నాగ్రిక్ అపూర్తి నిగమ్ (నాన్) కుంభకోణం కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి దిల్లీకి బదిలీ చేయాలని ఈడీ చేసిన అభ్యర్థనను అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. ఈ క్రమంలో ఈడీ పిటిషన్‌పై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది.
'ఆర్టికల్ 32 వ్యక్తిగత హక్కులను కాపాడడానికే'
వ్యక్తిగత హక్కులను కాపాడటానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్‌ను ఎలా దాఖలు చేస్తారని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం ఈడీని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఈడీ తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు పిటిషన్ ను ఉపసంహరించుకోవడానికి న్యాయస్థానం అనుమతిని కోరారు. ఈ సందర్భంగా ఈడీకి కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీంతో సుప్రీంకోర్టు మండిపడింది. ఈడీకి ప్రాథమిక హక్కుల ఉంటే, అది ప్రజల ప్రాథమిక హక్కుల గురించి కూడా ఆలోచించాలని వెల్లడించింది. ఆ తర్వాత పిటిషన్‌ను వెనక్కు తీసుకునేందుకు అనుమతించింది.
స్కామ్ ఏంటంటే?
ఛత్తీస్‌గఢ్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థలో కుంభకోణం 2015లో వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ప్రజా పంపిణీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేసేలా చూసే నోడల్ ఏజెన్సీ అయిన నాగ్రిక్ అపూర్తి నిగమ్ (NAN) కార్యాలయాలపై 2015 ఫిబ్రవరిలో ఏసీబీ దాడులు చేసింది. రూ.3.64 కోట్ల విలువైన లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకుంది. అలాగే బియ్యం, ఉప్పు నమూనాలలో నాణ్యత లేదని, అవి మానవ వినియోగానికి పనికిరానివిగా తేలింది. దీంతో ప్రజా పంపిణీ వ్యవస్థలో జరిగిన ఈ కుంభకోణం బయటపడింది. ఈ ఘటనపై 2019లో ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం, ఏసీబీ ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్ దాఖలు చేశాయి. వీటి ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుకున్న నాగ్రిక్ అపూర్తి నిగమ్ ఛైర్ పర్సన్ అనిల్ తుతేజా, ఎండీ శుక్లాకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ కు మంజూరు చేసింది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ ను అనిల్ తుతేజా దుర్వినియోగం చేశారని ఈడీ ఆరోపించింది. ఈ మనీలాండరింగ్ కేసులో కొంతమంది నిందితులకు న్యాయపరమైన ఉపశమనం కల్పించడానికి ఛత్తీస్‌గఢ్‌లోని కొంతమంది రాజ్యాంగ కార్యనిర్వాహకులు హైకోర్టు న్యాయమూర్తితో సంప్రదింపులు జరుపుతున్నారని దర్యాప్తు సంస్థ ఇటీవల ఆరోపించింది. పీఎంఎల్ఏ కేసును ఛత్తీస్‌గఢ్ నుంచి దిల్లీకి బదిలీ చేయాలని కోరింది. మనీలాండరింగ్ కేసులో కొంతమంది ఉన్నత స్థాయి నిందితులకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కేసును బదిలీ చేయలేమని స్పష్టం చేసింది.