Chennai Air Show 2024 : 92వ వాయుసేన వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నైలో నిర్వహించిన వైమానిక విన్యాసాలు సందర్శకుల మనసుదోచాయి. సామర్థ్యం, శక్తి, స్వావలంబన థీమ్‌తో ఈ విన్యాసాలు నిర్వహించారు. భారత వైమానిక దళం గరుడ్ కమాండోలు విన్యాసాలు నిర్వహించారు. వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ అమర్‌దీప్‌సింగ్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, మంత్రులు, చెన్నై మేయర్ ప్రియ తదితరులు ఈ విన్యాసాలను తిలకించారు. వైమానిక ప్రదర్శనను తిలకించేందుకు వచ్చిన సందర్శకులతో మెరినా బీచ్ కిక్కిరిసిపోయింది. భానుడి భగభగలను కూడా లెక్కచేయకుండా గొడుగులు పట్టుకొని వాయుసేన పరాక్రమాన్ని కనురెప్ప వాల్చకుండా చూశారు. 21 ఏళ్ల తర్వాత చెన్నైలో వైమానిక విన్యాసాలు జరిగడం విశేషం.
సాహసోపేత నైపుణ్యంతో ప్రదర్శన!
వాయుసేనకు చెందిన స్పెషల్ గరుడ్ ఫోర్స్ కమెండోల పరాక్రమంతో వైమానిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. బందీలను విడిపించటంలో వారు తమ సాహసోపేత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. పారాజంప్ ఇన్‌స్ట్రక్టర్లు నిర్దేశిత ప్రదేశంలో ల్యాండయ్యారు. లక్షిత ప్రాంతాన్ని చేరుకోవడానికి కమాండోలు దూసుకెళ్లిన తీరు. సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్స్‌లో చోటు!
సూపర్ సోనిక్ రఫేల్ జెట్‌ఫైటర్లతోపాటు 50యుద్ధ విమానాలు గగనతలంలో నిప్పుల వర్షం కురిపించాయి. హెరిటేజ్ ఫైటర్ జెట్ డకోట, హార్వర్డ్, తేజస్, సుఖోయ్-30, సారంగ్ హెలికాప్టర్లు గగనతలం నుంచి చేసిన సెల్యూట్ సందర్శకులను ఆకట్టుకుంది. దాదాపు 72యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. దీంతో ఈ విన్యాసాలకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్స్‌లో చోటు దక్కనుంది.
అలా కనురెప్ప కొట్టకుండా చూసిన సందర్శకులు!
సూపర్ సోనిక్ రఫెల్ జెట్‌ఫైటర్లు ఆకాశమంతా తిరుగుతూ గగనతలంలో ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. డకోటా యుద్ధవిమానం చేసిన విన్యాసాలను సందర్శకులు కనురెప్ప కొట్టకుండా చూశారు. సారంగ్ హెలికాప్టర్ల బృందం చేసిన విన్యాసాలు ఉత్కంఠభరితంగా సాగాయి. వాయుసేన వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే వైమానిక ప్రదర్శన రాజధాని దిల్లీ వెలుపల నిర్వహించటం ఇది మూడోసారి. గతేడాది యూపీలోని ప్రయాగ్‌రాజ్ జరిగిన ఈ విన్యాసాలు, అంతకుముందు ఏడాది చండీగఢ్‌లో నిర్వహించారు.