Kejriwal Resignation : దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తాను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకూ సీఎం పదవిలో ఉండనని స్పష్టం చేశారు. దిల్లీలోని ఆప్ కార్యాలయంలో ఆదివారం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగించారు.
ఆప్ కష్టాల్లో ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే తమతో ఉండి ముందుకు నడిపించాడని కేజ్రీవాల్ అన్నారు. దేవుడిచ్చిన ధైర్యంతో శత్రువులతో పోరాడతామనని తెలిపారు. ఆప్ నాయకులు సత్యేందర్ జైన్, అమానతుల్లా ఖాన్ ఇంకా జైల్లోనే ఉన్నారని, త్వరలోనే వారు బయటకు వస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
#WATCH | Delhi: CM Arvind Kejriwal says, " i thank god for always blessing us... we are overcoming all the problems. we are fighting against huge enemies and succeeding. we are just a small party that transformed the politics of this country. i thank god for this..." pic.twitter.com/VXBQTjlPHE
— ANI (@ANI) September 15, 2024
త్వరలో కొత్త సీఎం ఎంపిక
అయితే ఆప్ నుంచి మరొకరు సీఎం అవుతారని, కొత్త సీఎం ఎంపిక కోసం రెండు, మూడ్రోజుల్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్‌లో చీలికలు తెచ్చి దిల్లీలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. "మా పార్టీని ముక్కలు చేసేందుకే నన్ను జైలుకు పంపారు. కానీ ఎన్ని ఎత్తులు వేసినా పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయింది. నన్ను జైల్లో పెట్టి ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా రాజ్యాంగాన్ని రక్షించాలనే ఇన్నాళ్లు రాజీనామా చేయలేదు. జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీం కోర్టే ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని నడపవచ్చని వెల్లడించింది" అని కేజ్రీవాల్ అన్నారు.
మద్యం విధానానికి సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తిహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్, కుట్రపై సత్యం విజయం సాధించిందని అన్నారు. దేశాన్ని బలహీన పరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదని పేర్కొన్నారు. ఇప్పుడు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
#WATCH | On Delhi CM Arvind Kejriwal's 'I am going to resign from the CM position after 2 days' remark, BJP national spokesperson Pradeep Bhandari says, " this is a pr stunt of arvind kejriwal. he has understood that his image among the people of delhi is not of an honest leader… pic.twitter.com/cr10rchu7y
— ANI (@ANI) September 15, 2024
అయితే కేజ్రీవాల్ రాజీనామా ప్రకటనపై బీజేపీ స్పందించింది. "అది అరవింద్ కేజ్రీవాల్ పీఆర్ స్టంట్. దిల్లీ ప్రజల్లో ఆయనకున్న ఇమేజ్ ఏంటో అర్థమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి పార్టీగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. PR స్టంట్ కింద తన ఇమేజ్‌ను పునరుద్ధరించాలనుకుంటున్నారు. దిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ ఓడిపోతుంది" అని జోస్యం చెప్పారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ.