How Much Gold in Ayodhya Ram Mandir: బంగారం అంటే సామాన్యుడి నుంచి దేవుడి వరకు అందరూ ఇష్టపడతారు. దీంతో పాటు హిందూ మతంలో పసిడిని దానం చేయడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యం కలిగి ఉంది. అందుకే దేశంలోని దేవాలయాలలో వేల టన్నుల బంగారం నిల్వ ఉంది. ఏకంగా పంజాబ్‌లోని గోల్డెన్ టెంపుల్‌ను పసిడితోనే తీర్చిదిద్దారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయాలైన అయోధ్యలోని రామాలయం, బనారస్‌లోని కాశీ విశ్వనాథ్, సిర్ గోవర్ధన్ ఆలయంలో సుమారు 11 క్వింటాళ్ల బంగారం నిక్షిప్తమై ఉంది. ఈ పసిడి ఆలయ గోడలు, తలుపులను తయారుచేయడానికి వాడారు. ఈ క్రమంలో యూపీలోని ఏ ఆలయంలో ఎంత బంగారం ఉంది? దేవాలయ నిర్మాణంలో పసిడి ఎందుకు వాడుతారు? తదితర విషయాలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
దేవాలయ నిర్మాణాల్లో బంగారం వాడకం, నిక్షిప్తం గురించి ప్రముఖ వేద పండితులు, శ్రీ కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ సభ్యులు వెంకట్రామన్ గణపతి ఈటీవీ భారత్‌కు పలు విషయాలు తెలియజేశారు. సనాతన ధర్మంలో దేవాలయాల్లో బంగారం పెట్టడానికి గల కారణాన్ని పురాణ గ్రంథాలలో వివరించారన్నారు. దేవాలయాల్లో బంగారం పెట్టడం వెనుక కారణం దేవుని రుణం నుంచి విముక్తి పొందడమేనన్నారు. మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు వెంకట్రామన్ మాటల్లోనే.
దేవాలయాల్లో బంగారం ఎందుకు దానం చేస్తారు?
ప్రస్తుత కాలంలో ఇంట్లో ఏర్పాటు చేసిన పూజ గదిలో పూజలు, పారాయణం, క్రమం తప్పకుండా భోగం మొదలైన వాటికి ప్రజలకు సమయం ఉండడం లేదు. పూర్వ కాలంలో కూడా రాజులు, వారి కుటుంబీకులు తీర్థయాత్రలు, యుద్ధాలు కారణంగా ఇళ్లలో క్రమం తప్పకుండా పూజలు చేయలేకపోయేవారు. ఈ కారణంగా వారు దేవాలయాలకు బంగారాన్ని దానం చేసేవారు.
పసిడి దానం ప్రాముఖ్యత ఏంటి?
సనాతన ధర్మంలో దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందులో బంగారు దానం అగ్రస్థానంలో ఉంటుంది. దేవతలను పూజించలేకపోవడం వల్ల కలిగే దోషాలను వదిలించుకోవడానికి దేవాలయాలకు పసిడిని దానం చేస్తారు. ఎవరైనా తమ సంకల్పం, శక్తి మేరకు దేవాలయాలలో బంగారాన్ని దానం చేసి ప్రతిష్టిస్తే, దేవతల రుణం నుంచి విముక్తి లభిస్తుందని గ్రంథాలలో ప్రస్తావించారు.
బంగారాన్ని దానం చేయడం వల్ల పితృ దోషం తొలిగిపోతుందా?
పితృ దోషాన్ని వదిలించుకోవాలంటే వెండిని దానం చేసి దేవాలయాలలో ప్రతిష్టించాలి. ఈ కారణంగా ప్రతి ఆలయ శిఖరం, గర్భగుడి, ద్వారం మొదలైనవి బంగారం, వెండితో ప్రతిష్టిస్తారు. దేవాలయాలకు దానం చేసిన బంగారం, వెండిని ఆ ఆలయ భాగాల తయారీకి ఉపయోగిస్తారు.
అయోధ్య రామాలయంలో ఎంత బంగారం ఉంది?
అయోధ్య రామాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్, రాముడి సింహాసనంలోని తలుపులలో సుమారు రూ.50 కోట్ల విలువైన 45 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 161 అడుగుల ఎత్తైన శిఖరం వరకు ఈ రామాలయ వైభవం అతీంద్రియ, అద్భుతమైన రూపాన్ని ఇస్తోంది. రామాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో కూర్చున్న రామ్ లల్లా సింహాసనం, 14 ద్వారాలు, 161 అడుగుల ఎత్తైన ప్రధాన శిఖరం, మూడు గోపురాలు బంగారంతో ప్రకాశిస్తాయి. ప్రాకారాలలో నిర్మించిన గణేశుడు, హనుమంతుడు, సూర్యుడు, మాతా భగవతి, మాతా అన్నపూర్ణ, శివుడి ఆలయాల శిఖరాలు బంగారు కలశంతో పొదిగినవి. ఈ బంగారాన్ని ముంబయికి చెందిన వ్యాపారవేత్త దిలీప్ విరాళంగా ఇచ్చారు.
కాశీ విశ్వనాథుని ఆలయంలో ఎంత బంగారం ఉంది?
బనారస్‌లోని విశ్వనాథ ఆలయంలో 860 కిలోల బంగారం ఉంది. దీనిలో మహారాజా రంజిత్ సింగ్ 1835లో 22 మౌండ్లు (821 కేజీలు) బంగారాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వాత ఇంకొక దాత 2023లో 23 కేజీలు, మరొకరు 37 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ బంగారాన్ని గర్భగుడి, నాలుగు ద్వారాల ఏర్పాటులో ఉపయోగించారు. గర్భగుడిలో దాదాపు 37 కేజీల బంగారు రేకులను ఏర్పాటు చేశారు. బయటి గోడ, నాలుగు ద్వారాలను 23 కేజీల పసిడితో అలంకరించారు.
సిర్ గోవర్ధన్ ఆలయంలో ఎంత పసిడి ఉంది?
బనారస్‌లోని సిర్ గోవర్ధన్ ఆలయ నిర్మాణంలో 200 కేజీల పసిడిని ఉపయోగించారు. భక్తుల సహాయంతో ఆలయ గర్భగుడి ప్రవేశ ద్వారాన్ని బంగారంతో అలంకరించారు. దేవాలయ తలుపులకు బంగారు పూత వేశారు. ఆలయ పైభాగంలో ఉంచిన కలశం, సంత్ రవిదాస్ పల్లకి నుంచి ఆలయంలో ఉన్న గొడుగు వరకు ప్రతిదాన్ని పసిడితో తయారు చేశారు. సంత్ రవిదాస్ ఆలయంలో 130 కిలోల బంగారంతో చేసిన పల్లకిని ఉంచారు. ఆయన జయంతినాడు ఒకసారి పల్లకిని బయటకు తీస్తారు. ఈ ఆలయాన్ని 1965లో నిర్మించారు. ఈ టెంపుల్ కు మొదటి బంగారు కలశాన్ని 1994లో సంత్ గరీబ్ దాస్ కమ్యూనిటీ అందించింది. ఒక భక్తుడు ఈ ఆలయంలో 35 కిలోల బంగారు గొడుగును ఏర్పాటు చేసారు.
కాశీ అన్నపూర్ణ తల్లి ఆలయంలో ఎంత బంగారం ఉంది?
కాశీ విశ్వనాథుడికి ఆహారాన్ని దానం చేసిన అన్నపూర్ణ తల్లి బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని ధంతేరాస్ రోజున ఏటా ఒకసారి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆ రోజున అన్నపూర్ణా దేవి బంగారు రూపాన్ని దర్శించుకోవడం ద్వారా సంపద కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారి విగ్రహం దాదాపు 422 సంవత్సరాల పురాతనమైనది.
ఆర్బీఐ కంటే ఎక్కువ బంగారం
ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక 2024 ప్రకారం భారతదేశంలోని దేవాలయాలు, గృహాలు సహా మొత్తం 22,000- 25,000 టన్నుల బంగారం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, పద్మనాభ స్వామి ఆలయం, తిరుపతి బాలాజీ ఆలయం, పూరీ జగన్నాథ ఆలయం, వైష్ణో దేవి ఆలయంలో 4000 టన్నుల బంగారం నిల్వ ఉంది. భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అందుకే మనం 25 వేల టన్నులకు పైగా బంగారాన్ని భద్రపరుచుకున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలను కలిగి ఉన్న అమెరికా వద్ద ఉన్న 8,965 టన్నుల బంగారం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
ప్రపంచంలో ఎంత బంగారం ఉంది?
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం, ప్రపంచంలో దాదాపు 2.44 లక్షల మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇందులో 1.87 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయ్యాయి. అదే సమయంలో 57,000 మెట్రిక్ టన్నుల బంగారం భూగర్భ నిల్వలలో ఉంది. ఎక్కువ బంగారం చైనా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో దొరుకుతోంది.