Rahul Gandhi On Operation Sindoor : 'ఆపరేషన్ సిందూర్' వివరాల బహిర్గతంపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. 'ఆపరేషన్ సింధూర్' సమయంలో భారత వైమానిక దళం ఎన్ని విమానాలను కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జైశంకర్ ఈ విషయంపై మౌనంగా ఉన్నారని ఆరోపిస్తూ పలు ప్రశ్నలు సంధించారు.
"విదేశాంగ మంత్రి జైశంకర్ వహించడం కేవలం సమాచారాన్ని వెల్లడించకపోవడం మాత్రమే కాదు. అదొక విపత్కర పరిణామం. మరోసారి అడుగుతున్నాను. పాకిస్థాన్ పై దాడుల గురించి ఆ దేశానికి ముందే తెలియడం వల్ల ఎన్ని భారతీయ విమానాలను కోల్పోయాం? ఇది తప్పిదం కాదు. నేరం. దేశానికి నిజం తెలియాలి." అని రాహుల్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. దీనికి జైశంకర్ గతంలో మాట్లాడిన వీడియోను జోడించారు.
రాహుల్ వ్యాఖ్యలకు మాణకం ఠాగూర్ మద్దతు
మరోవైపు, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ మాణకం ఠాగూర్ సమర్థించారు. "2025 మే 17న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఒక నిర్దిష్టమైన ప్రశ్నను అడిగారు. పాక్ కు భారత్ చేసే దాడుల గురించి ముందుగానే తెలుసు కాబట్టి మనం ఎన్ని భారతీయ విమానాలను కోల్పోయాం? ఏ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనైనా ప్రతిపక్షాలు జాతీయ భద్రత విషయాలను లేవనెత్తినప్పుడు మంత్రులు స్పందించాల్సిన బాధ్యత ఉంటుంది. అయినప్పటికీ విదేశాంగ మంత్రి జైశంకర్ మౌనంగా ఉన్నారు. ఈ నిశ్శబ్దం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. పాక్ కు ఆపరేషన్ సిందూర్ గురించి ముందుగానే ఎందుకు సమాచారం ఇచ్చారు? ఈ కార్యాచరణ గోప్యత ఉల్లంఘనకు ఎవరు అధికారం ఇచ్చారు? దీని కారణంగా మన సాయుధ దళాలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాయి? ఇది దౌత్యపరమైన విషయం కాదు. శత్రువుకు ముందస్తు సమాచారం ఇవ్వడం నేరం. దేశానికి నిజం తెలియాలి" అని మాణికం ఠాకూర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
గతంలోనూ ఆరోపణలు
పాక్ ఉగ్రవాద వ్యవస్థలపై గురిపెట్టిన విషయాన్ని ఆపరేషన్ సిందూర్ మొదలుపెట్టడానికి ముందే కేంద్ర సర్కారు ఆ దేశానికి చెప్పి తప్పు చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం విమర్శించారు. పాక్‌పై దాడి గురించి ఆ దేశానికి ముందే సమాచారం ఇవ్వడం నేరమని ఆరోపించారు. దాడుల గురించి పాక్‌కు ముందే సమాచారం ఇచ్చినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బహిరంగంగా అంగీకరించారని చెప్పారు. వారికి అలా వెల్లడించడానికి ఎవరు అధికారం ఇచ్చారని, దాని ఫలితంగా ఈ ఆపరేషన్లో భారత వాయుసేన ఎన్ని విమానాలు కోల్పోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి జైశంకర్ వ్యాఖ్యల వీడియోను జోడించారు.
ఆ వీడియోలో జైశంకర్ ఏమన్నారంటే?
ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి ముందు పాక్ కు సమాచారం ఇచ్చినట్లు జైశంకర్ చెప్పినట్లు వీడియోలో ఉంది. "ఆపరేషన్ ప్రారంభంలో తాము పాక్ కు ఒక సందేశాన్ని పంపించాం. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి చేస్తున్నామని, పాక్ సైనిక స్థావరాలపై కాదని చెప్పాం. ఈ దాడుల్లో జోక్యం చేసుకోకుండా పాక్ ఆర్మీ బయట నిలబడే అవకాశం ఉంది. ఆ మంచి సలహాను పాక్ పట్టించుకోలేదు" అని జైశంకర్ వ్యాఖ్యానించారు.
ఖండించిన విదేశాంగ శాఖ
అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యాఖ్యలు వాస్తవాలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఖండించింది. ఆపరేషన్ సిందూర్ మొదలైన తొలి దశలో చేసిన హెచ్చరికను, ఆపరేషన్‌కు ముందు చేసినట్లు ఆరోపించడం తప్పుడు వ్యాఖ్యగా పేర్కొంది.
కాంగ్సెస్ వర్సెస్ బీజేపీ- అఖిలపక్ష బృందాలపై రాజకీయ రగడ
'మీ వ్యాఖ్యలతో దేశం సిగ్గుపడుతోంది'- మధ్యప్రదేశ్ మంత్రిపై సుప్రీం కోర్టు ఆగ్రహం