Sc On Revenue Not Custodians: హైకోర్టులు ఆదాయం తెచ్చే రెవెన్యూ విభాగానికి సంరక్షకులు కావని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దిల్లీకి చెందిన టెనార్మాక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు బెలాపూర్ కమిషనరేట్‌కు చెందిన సెంట్రల్ జీఎస్టీ విభాగం రూ.256.45 కోట్లు తిరిగి చెల్లించాలని ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం చెప్పింది. ఇలా చేయడం వింతగా ఉందంటూ పేర్కొంది. న్యాయవ్యవస్థ చట్టానికి కట్టుబడి ఉండాలని ధర్మాసనం గుర్తు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ టెనార్మాక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం శనివారం విచారించింది.
సీనియర్ న్యాయవాది రఫీఖ్ దాదా టెనార్మాక్ తరఫున వాదనలు వినిపించారు. హైకోర్టు జోక్యాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. రెవెన్యూ విభాగం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.డి. సంజయ్ వాదించారు.
జనవరి 24న టెనార్మాక్‌కు అనుకూలంగా సీఈఎస్‌టీఏటీ(కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యూనల్) తీర్పు ఇచ్చింది. మే 6న ట్రిబ్యునల్ రూ.256.45 కోట్ల నగదు రిఫండ్‌ను ప్రాసెస్ చేయాలని రెవెన్యూ శాఖను ట్రిబ్యూనల్ ఆదేశించింది. దీంతో బెలాపూర్ సీజీఎస్టీ, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ సెక్షన్ 35G ప్రకారం బాంబే హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సెంట్రస్ జీఎస్టీకి సంబంధించినది కావడంతో తనకు ఆ అప్పీలను విచారించే అధికారం (జ్యూరిడిక్షన్) లేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు సూచిస్తూనే తాత్కాలిక రక్షణగా ట్రిబ్యూనల్ ఉత్తర్వులపై ఎనిమిది వారాల స్టే ఇచ్చింది. అయితే అధికారం లేదంటూనే 8 వారాలా స్టే ఎలా ఇస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ స్టే వల్ల టెనార్మాక్ సంస్థ తన కార్యకలాపాలు నిలిపేసిందన్న అంశాన్ని కూడా కోర్టు గుర్తు చేసింది.
సీఈఎస్‌టీఏటీ జనవరి 24, 2025న ఇచ్చిన తీర్పు అనంతరం రెవెన్యూ విభాగం అధికారులు నేరుగా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. 'ఒక హైకోర్టు రెవెన్యూకు సంరక్షకుడు కాదు. ఇది విచిత్రమైన ఉత్తర్వు. తనకు జ్యూరిడిక్షన్ (అధికారం) లేదని తానే చెప్పి, తర్వాత ఎలా ఆదేశాలు ఇస్తారు? అని ధర్మాసనం ప్రశ్నించింది. టెనార్మాక్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆరువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ విభాగానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ విచారణను జులై 2వ తేదీకి వాయిదా వేసింది.