Jyoti Malhotra Case Details : దాయాది దేశం పాకిస్థాన్‌కు గూఢచారిగా వ్యవహరించిందన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో హరియాణా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. విచారణలో కీలక విషయాలు రాబడుతున్నారు. ఆమెను పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్లు తమ అస్త్రంగా మలుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆమె పాక్ రాయబార కార్యాలయంలో పనిచేసే అధికారితో సంప్రదింపులు జరిపినట్లు నిర్దరించారు. ఈ మేరకు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ సావర్ పలు విషయాలు తెలిపారు.
జ్యోతి మల్హోత్రా సైనిక లేదా రక్షణ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం వారితో పంచుకుందని ప్రస్తుత దశలో చెప్పలేమని ఎస్పీ తెలిపారు. కానీ, పాక్ నిఘా వర్గాలతో (PIO) ఆమె నేరుగా సంప్రదింపులు జరిపారని చెప్పారు. వాళ్లు ఆమెను ఓ అస్త్రంగా చేసుకున్నారని కచ్చితంగా చెప్పగలమని అన్నారు. జ్యోతి ఇతర యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లతో కూడా టచ్‌లో ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. వాళ్లు కూడా పీఐవోలతో సంప్రదింపులు జరుపుతున్నారని అన్నారు.
అయితే ఇది కూడా ఓ రకమైన యుద్ధమేనని తెలిపారు. ఇన్‌ఫ్లుయెన్సర్లను నియమించుకుంటూ వారి ప్రయత్నాలను అమలు చేస్తారని అన్నారు. జ్యోతి మల్హోత్రా పాకిస్థాన్‌లో పలుమార్లు పర్యటించిందని చెప్పారు. అంతే కాదు, ఓసారి చైనాకూ వెళ్లి వచ్చినట్లు వెల్లడించారు. ఇటీవల బహిష్కరణకు గురైన పాకిస్థాన్ అధికారితో కూడా ఆమె టచ్‌లో ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.
ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు విశ్లేషిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఎక్కడికి వెళ్లింది? ఎవరిని కలిసింది? అనే విషయాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అదే సమయంలో ఆమె ల్యాప్‌టాప్ సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై ఫోరెన్సిక్ విశ్లేషణ చేస్తామని వెల్లడించారు. ఏం సమాచారం పంచుకుందనే విషయం అప్పుడు స్పష్టమవుతుందని పేర్కొన్నారు.
అంతకుముందు, పూరీకి చెందిన మరో యూట్యూబర్‌తో జ్యోతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెప్టెంబర్‌లో పూరీ సందర్శించారని, అక్కడ మరో మహిళా యూట్యూబర్‌ను కలిసినట్లు గుర్తించామని ఒడిశాలోని పూరీ ఎస్పీ వినీత్ అగర్వాల్ వెల్లడించారు. పూరీకి చెందిన సదరు యూట్యూబర్ ఇటీవల పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించినట్లు ఆయన తెలిపారు.