Girlfriend in Suitcase : ప్రేమికురాలిని కలిసేందుకు ఓ విద్యార్థి పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ను ఎవరికీ తెలియకుండా సూట్‌కేసులో కుక్కి తాను ఉండే బాయ్స్ హాస్టల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే యాజమాన్యానికి అనుమానం వచ్చి లగేజ్ బ్యాగ్ తెరవడం వల్ల అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన హరియాణాలోని సోనిపట్‌లో ఉన్న జిందాల్ విశ్వవిద్యాలయంలో జరిగింది.
ఇదీ జరిగింది
ఓపీ జిందాల్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి పెద్ద సూట్‌కేస్‌తో హస్టల్‌లోకి వచ్చాడు. అందులో ఏమున్నాయని సిబ్బంది ప్రశ్నించగా దుస్తులు, వస్తువులు ఉన్నట్లు చెప్పాడు. కానీ, హాస్టల్ లోపలికి తీసుకెళ్లే క్రమంలో సూట్‌కేస్ గోడను తాకింది. దీంతో లోపల ఉన్న అమ్మాయి కేకలు వేసింది. దీనిని విన్న సెక్యూరిటీ అనుమానం వచ్చి సూట్‌కేస్ తెరవాలని కోరగా అందుకు నిరాకరించాడు.
దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సూట్‌కేస్‌ను తెరవగా అందులో నుంచి ఓ అమ్మాయి బయటకు రావడం వల్ల అందరూ షాకయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ విద్యార్థి చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల వైరల్‌గా మారింది. అయితే సూట్‌కేసులో ఉన్న అమ్మాయి అదే విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థా? లేక బయటనుంచి వచ్చిన వ్యక్తా అనే విషయం ఇంకా బయటపడలేదు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు వివరించారు. వీడియో వైరల్‌గా మారడం వల్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ "ఈ మధ్య సూట్ కేసులు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నట్టున్నాయి" అంటూ పోస్ట్ చేశారు.