ETV Bharat / bharat

ఐపీఎస్​ బలవన్మరణం కేసు- కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా బలవంతంగా పోస్టుమార్టం!

ఐపీఎస్​ బలవన్మరణం కేసు- రోహ్​తక్​ ఎస్పీ నరేంద్ర బదిలీ- కొత్త ఎస్పీగా సురేంద్ర భౌరియా నియామకం

IPS Suicide Case
IPS Suicide Case (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : October 11, 2025 at 3:40 PM IST

3 Min Read
Choose ETV Bharat

IPS Suicide Case Update : హరియాణా సీనియర్​​ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్​​ బలవన్మరణం కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆయన సూసైడ్ చేసుకుని ఐదు రోజులు అయినప్పటికీ పోస్టుమార్టంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. శనివారం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సెక్టార్​ 16 ప్రభుత్వ ఆసుపత్రి నుంచి పీజీఐకు తరలించారు. అయితే తమ ఇష్టానికి విరుద్ధంగా మృతదేహాన్ని బలవంతంగా పోస్టుమార్టం కోసం తీసుకెళ్లారని, బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు కుటుంబ సభ్యుల అనుమతితోనే పోస్టుమార్టం జరుగుతుందని చండీఘడ్​ డీజీపీ అన్నారు.

శవపరీక్షపై వివాదం
ఐపీఎస్​ అధికారి పూరన్ కుమార్​ సోదరుడు, ఐఏఎస్​ అధికారి అమనీత్​ పి.కుమార్​ల సోదరుడైన అమిత్​ రతన్ (ఆప్​ ఎమ్మెల్యే) పోస్టుమార్టం విషయంలో​ తీవ్ర ఆరోపణలు చేశారు.

"కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, బలవంతంగా తమ సోదరుడి మృతదేహాన్ని పీజీఐకి తరలించారు. అక్కడ పోస్టు మార్టం నిర్వహించారు. ఏడీజీపీ స్థాయి అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పటికి 5 రోజులు అయ్యింది. కానీ మాకు న్యాయం జరగలేదు" అని అమిత్​ రతన్ ఆరోపించారు.

మరోవైపు ఈ ఆరోపణలను చండీఘడ్​ డీజీపీ ఖండించారు. "కుటుంబ సభ్యుల సమ్మతితోనే పోస్టుమార్టం జరుగుతుంది. వారి సమ్మతిని మేము అడిగాం. పీజీఐలో వైద్యుల బోర్డు ఏర్పాటు చేశాం. పోస్టుమార్టంకు సంబంధించిన వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ కూడా ఉంటుంది" అని ఆయన అన్నారు.

రాజకీయ దుమారం
ఐపీఎస్​ బలవన్మరణం కేసు హరియాణాలో రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యంగా హరియాణా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల దాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహ్​తక్​ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను తొలగించి, ఆయన స్థానంలో ఐపీఎస్​ సురేంద్ర భౌరియాను నియమించారు.

The order of the removal of Rohtak SP Narendra Bijarnia.
- రోహ్​తక్​ ఎస్పీ నరేంద్ర బదిలీ- కొత్త ఎస్పీగా సురేంద్ర భౌరియా నియామకం (ETV Bharat)

కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "కుటుంబ సభ్యులు సమ్మతి లేకుండా పూరన్ కుమార్​ మృతదేహాన్ని సెక్టార్​ 16 ఆసుపత్రి నుంచి తరలించడం అమానుషం. ఆయన కుమార్తెలకు, తండ్రిని చివరి చూపు చూసుకోవడానికి కూడా అనుమతించడం లేదు. హరియాణాలో ఒక సీనియర్ ఐపీఎస్​ అధికారి కుటుంబానికి కూడా న్యాయం జరగకపోతే, సామాన్యులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది?" అని ఆయన ప్రశ్నించారు.

ఐపీఎస్ అధికారి బలవన్మరణం కేసుపై బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ఎక్స్​ వేదికగా స్పందించారు. "హరియాణాలో ఐజీ ర్యాంక్​లో సీనియర్ పోలీసు అధికారి వై.పూరన్ కుమార్​ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయన భార్య హరియాణాకు చెందిన ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిణి. కానీ వారు కుల వివక్ష, వేధింపులకు గురికావడం దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ముఖ్యంగా దళిత, బహుజన వర్గాల ప్రజలు చాలా కలత చెందారు" అని ఆమె అన్నారు.

ఇంతకీ ఏం జరిగింది?
ఎఫ్​ఐఆర్​ ప్రకారం, ఐపీఎస్​ పురాన్ కుమార్​ తన వేతన చెల్లింపుల కోసం ప్రశ్నించగా, ఉన్నతాధికారులు వేధించడంతో పాటు వాటిని నిలిపివేశారు. ఏడీజీపీ సంజ్​ కుమార్​, ఐజీపీ పంకజ్​ నైన్​, కళా రామచంద్రన్​, సందీప్​ కిర్వార్​, సిబాష్​ కవిరాజ్​, మనోజ్ యాదవ్​, పీకే అగర్వాల్​ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్​ అధికారులైన టీవీఎస్​ ప్రసాద్​, రాజీవ్​ ఆరోరా పేర్లు ఎఫ్​ఐఆర్​లో చేర్చారు. పూరన్‌ కుమార్‌ తన తండ్రి అంతిమ సంస్కారాలకు సెలవులు అడిగినా ఇవ్వకుండా వీరంతా అడ్డుకున్నారని అందులో పేర్కొన్నారు.

మరోవైపు సీనియర్‌ ఐపీఎస్​ పూరన్‌ కుమార్‌ బలవన్మరణంపై ఆయన భార్య, ఐఏఎస్​ అధికారిణి అమ్నీత్‌ పీ కుమార్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీకి అమ్నీత్‌ లేఖ రాశారు. 8 పేజీల్లో సూసైడ్ నోట్ లభించినా, ఫిర్యాదు చేసినా ఎలాంటి ఎఫ్​ఐఆర్​ నమోదు కాలేదని పేర్కొన్నారు. పూరన్‌ సూసైడ్‌ నోట్‌లో ఉన్నతాధికారుల వేధింపులు, అవమానాల గురించి పేర్కొన్నప్పటికీ వాటిని చండీగఢ్‌ పోలీసులు విస్మరించారని ఆరోపించారు. తన భర్త మరణానికి కారణమైన వారినుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎంను కోరారు.

లేటు వయస్సులో ఘాటు ప్రేమ- 70ఏళ్ల వయసులో 35 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న తాత!

రైతుల ముఖంలో ఆనందం చూడడమే మా లక్ష్యం- ప్రధాని మోదీ