
IPS అధికారి బలవన్మరణం చాలా సీరియస్ మ్యాటర్: పంజాబ్ గవర్నర్
ప్రజల్లో నెలకొన్న అగ్రహాన్ని తగ్గించేలా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన

Published : October 12, 2025 at 3:04 PM IST
Haryana IPS Officer Death Case : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హరియాణాకు చెందిన సీనియర్ ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య తీవ్రమైన అంశమని పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా అన్నారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ గమనిస్తే ఈ అంశం తీవ్రత అర్థమవుతుందని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న అగ్రహాన్ని తగ్గించేలా పోలీసులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. దాదాపు 14-15 మంది పోలీసు ఉన్నతాధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం చూస్తేనే కేసు తీవ్రత అర్థమవుతోంది. హరియాణా ప్రభుత్వం ఎస్పీని ఇప్పటికే బదిలీ చేసింది. ఇంకా డీజీపీని అరెస్ట్ చేయాలని డిమాండ్ వస్తోంది. అయితే, డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేసే ముందు అన్ని రకాలుగా నిజాలు తెలుసుకుని ముందుకు వెళ్లాలి.
- గులాబ్ చంద్ కటారియా, పంజాబ్ గవర్నర్
అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ అంగీకరిస్తుందని ఆశాభావం
ఐపీఎస్ అధికారి పురాన్ కుమార్ అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ అంగీకరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు హరియాణా మంత్రి కృష్ణన్ కుమార్ బేడీ. ఆయన కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఆదివారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబం కోరికి మేరకు ఇప్పటికే రోహ్‌తక్ ఎస్పీని బదిలీ చేశామని, కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు.
కాగా, ఇప్పటికే పూరన్ కుమార్ ఆత్మహత్య కేసుపై సత్వర, నిష్పాక్షిక, సమగ్ర దర్యాప్తు కోసం ఆరుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు చండీగఢ్ పోలీసులు. సిట్‌కు చండీగఢ్ ఐజీ పుష్పేంద్ర కుమార్ నేతృత్వం వహిస్తుండగా, చండీగఢ్ ఎస్పీ కన్వర్‌దీప్ కౌర్, ఎస్పీ సిటీ కేఎం ప్రియాంక, డీఎస్పీ చరణ్‌జిత్ సింగ్ విర్క్, ఇతర అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియాను ప్రభుత్వం శనివారం బదిలీ చేసింది. దోషులు ఏ స్థాయివారైనా వదిలిపెట్టేది లేదని ముఖ్యమంత్రి నాయబ్‌సింగ్ సైనీ స్పష్టంచేశారు. ఈ అంశాన్ని రాజకీయం చేయవద్దని విపక్షానికి హితవుపలికారు.
సీనియర్ అధికారులకూ న్యాయం జరగలేదు: సోనియా
సీనియర్ ఐపీఎస్ పురాన్ కుమార్ ఆత్మహత్య కేసు హరియాణాలో రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యంగా హరియాణా ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల దాడి చేస్తున్నాయి. ఆయన భార్య అమ్నీత్ కుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లేఖ రాశారు. న్యాయపోరాటానికి కోట్ల మంది భారతీయులు అండగా ఉన్నారని హామీ ఇచ్చారు. అత్యంత సీనియర్ అధికారులకు సైతం సామాజిక న్యాయం జరగడంలేదని, వారూ వివక్షను ఎదుర్కొంటున్నారని పూరన్ ఉదంతం చాటుతోందని తెలిపారు.
ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం
2001 బ్యాచ్ హరియాణా క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ చండీగఢ్‌లోని తన నివాసంలో అక్టోబర్ 7న బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ బలవన్మరణానికి సీనియర్ల వేధింపులే కారణమని పేర్కొంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొనడం సంచలనం రేపింది. తన వేతన చెల్లింపుల కోసం ప్రశ్నించగా, ఉన్నతాధికారులు వేధించడంతో పాటు వాటిని నిలిపివేశారు. ఏడీజీపీ సంజ్ కుమార్, ఐజీపీ పంకజ్ నైన్, కళా రామచంద్రన్, సందీప్ కిర్వార్, సిబాష్ కవిరాజ్, మనోజ్ యాదవ్, పీకే అగర్వాల్ సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులపై కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో ఇద్దరు ఐఏఎస్ అధికారులైన టీవీఎస్ ప్రసాద్, రాజీవ్ ఆరోరా పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చారు. పూరన్ కుమార్ తన తండ్రి అంతిమ సంస్కారాలకు సెలవులు అడిగినా ఇవ్వకుండా వీరంతా అడ్డుకున్నారని అందులో పేర్కొన్నారు.
మరోవైపు సీనియర్ ఐపీఎస్ పూరన్ కుమార్ బలవన్మరణంపై ఆయన భార్య, ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ పీ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన బలవన్మరణానికి ఉన్నతాధికారుల వేధింపులే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి అమ్నీత్ లేఖ రాశారు. 8 పేజీల సూసైడ్ నోట్ లభించినా, ఫిర్యాదు చేసినా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని పేర్కొన్నారు. పూరన్ సూసైడ్ నోట్‌లో ఉన్నతాధికారుల వేధింపులు, అవమానాల గురించి పేర్కొన్నప్పటికీ వాటిని చండీగఢ్ పోలీసులు విస్మరించారని ఆరోపించారు. తన భర్త మరణానికి కారణమైన వారి నుంచి తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎంను కోరారు.
ఐపీఎస్ బలవన్మరణం కేసు- కుటుంబ సభ్యుల సమ్మతి లేకుండా బలవంతంగా పోస్టుమార్టం!

