Largest Hanuman Statue In Faridabad : హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఉన్న 111 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. భారత్‌లోనే కాదు ఆసియా ఖండంలోనే ఇదే అతిపెద్ద కూర్చొన్న భంగిమలో ఉన్న హనుమాన్ విగ్రహం. హనుమాన్ జయంతి (ఏప్రిల్ 12) సందర్భంగా దేశనలుమూలల నుంచి ఈ ఆంజనేయుడిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గతంలో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడేవారు. కానీ హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠించినప్పటి నుంచి భయం పోయి ఈ రోడ్డుపై ప్రయాణాలు చేస్తున్నారు. అంతేకాదు, గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్డులో గతంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు జరిగేవి. హనుమాన్ విగ్రహాన్ని నిర్మించినప్పటి నుంచి యాక్సిడెంట్లు తగ్గాయని స్థానికులు చెబుతున్నారు.
గురుగ్రామ్-ఫరీదాబాద్ రోడ్‌లోని ఆరావళి కొండలపై నిర్మించిన ఎత్తైన హనుమాన్ విగ్రహాన్ని చూడటానికి ప్రజలు దూర ప్రాంతాలు నుంచి వస్తుంటారు. ఈ విగ్రహం ఎత్తు 111 అడుగులు ఉండడం వల్ల చాలా కిలోమీటర్ల దూరం నుంచి భక్తులు దీన్ని చూడొచ్చు.
కోరిన కోర్కెలు తీర్చే దేవుడు
ఫరీదాబాద్‌లో కొలువైన హనుమంతుడు తమను ఎప్పుడూ నిరాశపరచడని భక్తులు నమ్ముతుంటారు. మనస్ఫూర్తిగా తనను ప్రార్థించేవారి కోరికలను కచ్చితంగా తీరుస్తాడని భావిస్తుంటారు. అందుకే దేశంలోని పలు రాష్ట్రాల నుంచి రోజూ వేలాది మంది భక్తులు ఈ హనుమాన్ విగ్రహాన్ని చూడడానికి వస్తుంటారు. ముఖ్యంగా మంగళ, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
రాజస్థాన్ కళాకారులతో నిర్మాణం
ఈ భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణ పనులు 2010లో ప్రారంభమయ్యాయని ఆలయ ప్రధాన పూజారి ఖేమ్ చంద్ 'ఈటీవీ భారత్'తో చెప్పారు. "2017నాటికి విగ్రహం పని పూర్తైంది. రాజస్థాన్‌కు చెందిన కళాకారుల బృందం ఈ విగ్రహాన్ని తయారుచేశారు. దీని ఎత్తు 111 అడుగులు. ఇది భారత్‌లోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద కూర్చున్న భంగిమలో ఉన్న హనుమాన్ విగ్రహం. దీని తయారీకి భారీగా ఖర్చయ్యింది. విగ్రహ నిర్మాణానికి ప్రజలందరూ విరాళాలు ఇచ్చారు." అని ఖేమ్ చంద్ తెలిపారు. హనుమాన్ జయంతి నాడు ఫరీదాబాద్‌లోని ఆంజనేయుడి విగ్రహాన్ని చూడడానికి దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం భోజన వసతిని కూడా ఏర్పాటు చేస్తారు.