Indigo Flight Mayday Call : ఎయిరిండియాకు చెందిన విమానం ఇటీవల ఘోర ప్రమాదానికి గురవ్వగా, ఇప్పుడు ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఫ్లైట్‌కు ప్రమాదం తప్పింది. పైలట్ మేడే సందేశం పంపడంతో సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడింది. గువాహటి నుంచి చెన్నైకి వెళ్తున్న ప్లెట్లో ఆ ఘటన మూడు రోజుల క్రితం జరగ్గా, తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే?
సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, గురువారం గువాహటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో ఉన్న ఇండిగో విమానం (6E6764) బయలుదేరింది. టేకాఫ్ అయిన కొంతసేపటికి విమానంలో ఇంధనం తక్కువగా ఉందని పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీకి మేడే సందేశం పంపారు. కానీ విమానాశ్రయంలో రద్దీ కారణంగా చెన్నైలో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ అనుమతి పొందలేదు.
ఆ తర్వాత చెన్నై గగనతలంలోనే విమానంతో కొంతసేపు చక్కర్లు కొట్టారు. అనంతరం రాత్రి 8.15 గంటలకు విమానాన్ని బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి అనుమతి పొందారు. ఆ వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దీంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. అయితే ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
మేడే కాల్ అంటే ఏంటి?
అత్యవసర ప్రమాద పరిస్థితి ఎదుర్కొంటున్నామన్న విషయాన్ని రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడం కోసం పైలట్ మేడే కాల్‌ను వాడుతారు. దాని ద్వారా ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇండిగో విమానం పైలట్ దాన్ని వినియోగించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు అయింది.
అయితే ఇటీవల ఎయిరిండియా విమానం ఘోర ప్రమాదానికి గురైంది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఉన్న వైద్యసముదాయానికి చెందిన భవనంపై కూలిపోయింది. దీంతో ఫ్రైట్‌లో 242 మంది ప్రయాణికులు ఉండగా, 241 మంది మరణించారు. ఒక్క వ్యక్తి మాత్రమే ప్రమాదంలో ప్రాణాలతో మిగిలారు. భవనంలోని పలువురు కూడా చనిపోయారు.