Stones In Gallbladder : దేశ రాజధాని దిల్లీలోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో 70 ఏళ్ల వ్యక్తికి అరుదైన శస్త్ర చికిత్స చేశారు. వృద్ధుడి పిత్తాశయం నుంచి 8,125 రాళ్లను బయటకు తీశారు. ఆపరేషన్ అయ్యాక రాళ్లను లెక్కపెట్టడానికి ఆరు గంటల సమయం పట్టింది. ప్రస్తుతం వృద్ధుడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ మేరకు వైద్యులతోపాటు ఆస్పత్రి యజమాన్యం వెల్లడించింది.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, వృద్ధుడు చాలా కాలంగా కడుపునొప్పి, జ్వరం, ఆకలి లేకపోవడం, బలహీనత వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఇటీవల అతడికి ఛాతీలో భారంగా అనిపించింది. దీంతో కుటుంబసభ్యులు మే12న పోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చారు. అప్పటికే అతడు విషమ సిత్థిలో ఉన్నాడు. వెంటనే వైద్యులు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయగా, అతడి పిత్తాశయం భారీగా ఉన్నట్లు గుర్తించారు.
ఆ తర్వాత ఇన్వాసివ్ లాపరోస్కోపిక్ సర్జరీ చేసి వృద్ధుడి పిత్తాశయంలో పేరుకుపోయిన వేలాది రాళ్లను తొలగించారు. శస్త్రచికిత్స దాదాపు గంటసేపు కొనసాగగా, వాటి లెక్కింపు ప్రక్రియ ఆరు గంటలపాటు జరిగింది. 8,125 సంఖ్యలను తొలగించినట్లు నిర్ధరించింది. ఇంత పెద్ద మొత్తంలో రాళ్లు ఏర్పడిన కేసు దిల్లీ నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) పరిధిలో ఇదే మొట్టమొదటిదై ఉండొచ్చని యాజమాన్యం తెలిపింది.
పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయకపోతే, రాళ్లు క్రమంగా పెరుగుతూనే ఉంటాయని డాక్టర్ అమిత్ జావేద్ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రోగి నిర్లక్ష్యం కారణంగా రాళ్లు పెరిగాయని, ఇంకా ఆలస్యమై ఉంటే పరిస్థితి గణనీయంగా క్షీణించేదని చెప్పారు. పిత్తాశయంలో చీము ఏర్పడటం ప్రారంభమవుతుందని, ఫైబ్రోసిస్ కూడా సంభవించవచ్చని చెప్పారు. చాలా ఏళ్లపాటు పట్టించుకోకుండా ఉంటేనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు. అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు.
శరీరంలో కొవ్వుల సమతాస్థితి లోపించడం వల్ల గాల్‌స్టోన్స్ (పిత్తాశయ రాళ్లు) ఏర్పడుతుంటాయని, ఇది అరుదైన కేసుగా వర్ణించారు డా. అమిత్ జావేద్. దాని వల్ల పిత్తాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా తోసిపుచ్చలేమని అన్నారు. శస్త్రచికిత్స తర్వాత రోగి పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు. శస్త్రచికిత్స తర్వాత రెండు రోజుల పాటు పరిశీలన అనంతరం డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు.
33 ఏళ్ల వ్యక్తి కడుపులో 33 కాయిన్స్- 3 గంటల పాటు డాక్టర్ల ఆపరేషన్!
ఐదేళ్ల చిన్నారి కడుపులో 12 కిలోల కణితి.. వైద్యుల ఆపరేషన్‌తో లక్కీగా..