Puri Ratha Yatra 2025 Meeting : భారతదేశంలోనే అతిపెద్ద పూరీ జగన్నాథుడి రథయాత్ర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాలను చూడటానికి లక్షలాది మంది ప్రజలు దేశవిదేశాల నుంచి తరలి వస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే పూరీ రథయాత్రకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఒడిశా ప్రభుత్వం సూచించింది. అలాగే కొవిడ్ లక్షణాలు ఉన్నవారు రథయాత్రలో పాల్గొనవద్దని పేర్కొంది. పూరీ రథయాత్రకు సంబంధించి సోమవారం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఈ మేరకు సూచనలు చేశారు.
కరోనాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా, కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హరిచందన్ తెలిపారు. జలుబుతో బాధపడుతున్నవారు రథయాత్రలో పాల్గొనవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య పెరగకుండా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకోవాలని వివిధ ప్రకటనల ద్వారా తెలిజేస్తున్నామని తెలిపారు. రథయాత్రకు వచ్చే భక్తులు మాస్క్‌లు ధరించడం, చేతులు తరచుగా శుభ్రపరచడం వంటి సాధారణ కొవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు రథయాత్రలో పాల్గొనవద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49 కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య కార్యదర్శి అశ్వతీ తెలిపారు. కొవిడ్ లక్షణాలు ఉన్నవారు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.

హరిచందన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మరిన్ని విషయాలపై కూడా చర్చించారు. రథ నిర్మాణం, కలప సరఫరా, రథం లాగడం, ఆరోగ్య సేవలు, తాగునీటి సరఫరా, విద్యుత్, మురుగునీరు, రోడ్డు రవాణా, రైల్వే రవాణా, రోడ్ క్రాసింగ్ మరమ్మతు, టెలిఫోన్ వ్యవస్థ, శాంతిభద్రతల నిర్వహణ, నిత్యావసర వస్తువుల సరఫరా, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి అంశాలపై సమావేశంలో చర్చలు జరిగాయి. అదేవిధంగా, కరోనా పెరుగుతోన్న నేపథ్యంలో రథయాత్రను ఎలా నిర్వహించాలనే దానిపై చర్చ జరిగింది.