Amendments To Atomic Energy Act : అణు విద్యుత్ రంగానికి సంబంధించిన చట్టాల్లో సవరణలు చేయాలని కేంద్ర సర్కారు యోచిస్తోంది. ఈ రంగాన్ని పర్యవేక్షించే ప్రభుత్వ నియంత్రణ సంస్థలోనూ సంస్కరణలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఈ విభాగంలోకి అనుమతించాలని కేంద్రం భావిస్తోంది. దీనివల్ల 2047 నాటికి 100 గిగావాట్ల అణు ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే భారతదేశ దీర్ఘకాలిక లక్ష్యం సాకారం అవుతుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
'సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్'లో సవరణలు చేసి అణు ఇంధన ప్లాంట్ల నిర్మాణానికి పరికరాలను సప్లై చేసే కంపెనీల బాధ్యతను మరింత తగ్గించాలని భావిస్తున్నారు. భారత అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ పేరు 'ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్'. దీన్ని సంక్షిప్తంగా 'ఇన్ స్పేస్' (INSPACe) అని పిలుస్తారు. దీన్ని 2020 సంవత్సరంలో ప్రారంభించారు. ఈ సంస్థ ఏర్పాటైనప్పటి నుంచి భారత్‌లోని అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు ప్రోత్సాహం లభిస్తోంది. అచ్చం ఇదే తరహాలో అణు విద్యుత్ రంగ నియంత్రణ సంస్థ కూడా ఉండాలని కేంద్రం భావిస్తోంది. అందుకు అవసరమైన సంస్కరణలన్నీ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది.
నియంత్రణ వ్యవస్థల్లో మార్పులు జరుగుతాయి : భారత అణు ఇంధన విభాగం
"రాబోయే రోజుల్లో అణు విద్యుత్ రంగంలో ప్రైవేటు సంస్థలను మనం ప్రోత్సహించబోతున్నాం. అందుకు అనుగుణంగా అణు ఇంధన రంగ నియంత్రణ వ్యవస్థల్లో మార్పులు జరుగుతాయి. భారత్‌లో పెరుగుతున్న ఇంధన అవసరాలకు అనుగుణంగా అణు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతాం" అని ఇటీవలే కేంద్ర అణు ఇంధన విభాగం అధికార వర్గాలు వెల్లడించాయి.
ఆ ఒప్పందంతో భారత్‌కు వెసులుబాటు
భారత్‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు విదేశీ అణు విద్యుత్ సంస్థలు కూడా ఆసక్తితో ఉన్నాయి. 2008లో జరిగిన భారత్ - అమెరికా పౌర అణు ఇంధన ఒప్పందం అమల్లో భాగంగా మరిన్ని అణు ఇంధన ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును భారత్ పొందింది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, వయబిలిటీ గ్యాఫ్ ఫండింగ్, సావరీన్ గ్యారంటీల ద్వారా దేశంలో అణు విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని భారత పార్లమెంటరీ కమిటీ ఒకటి గతంలో సిఫార్సు చేసింది. అణు ఇంధన చట్టం, సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్‌లలో సవరణలు చేయాలని కూడా ఈ కమిటీయే సూచించింది.
ప్రైవేటుపై భారీ అంచనాలు
క్యాప్టివ్ అణు విద్యుత్ అవసరాల కోసం 220 మెగావాట్ల సామర్థ్యం కలిగిన స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఏర్పాటు చేయాలని భారత సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం భారతీయ కంపెనీల నుంచి ఇటీవలే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిడ్లను ఆహ్వానించింది. 2047 నాటికి భారత్ 100 గిగావాట్ల అణు విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలిగేలా ప్లాంట్లను ఏర్పాటు చేసే సామర్థ్యం ప్రైవేటు కంపెనీలకు ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇందులో 50 శాతం లక్ష్యాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు సంయుక్తంగా పీపీపీ పద్ధతిలో సాధించగలవని ఆశిస్తున్నారు.
'భారత్ ఎన్ని విమానాలు కోల్పోయింది- దేశానికి నిజం తెలియాలి'- జైశంకర్ మౌనంపై రాహుల్ ప్రశ్నలు