Tourists Getting Lost on Mountains : హనీమూన్ కోసం సిక్కింకు వెళ్లిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జంట ఆచూకీ గత 15 రోజులుగా కనిపించడం లేదు. టూర్ కోసం హిమాచల్‌ప్రదేశ్‌కు వచ్చిన ఇజ్రాయెల్‌కు చెందిన ఓ పర్యాటకుడి జాడ గత వారం రోజులుగా దొరకడం లేదు. చాలావరకు పర్యాటకులు పర్వత ప్రాంతాల్లోనే గల్లంతు అవుతుంటారు. ఏటా ఇలాంటి వార్తలు చాలానే వస్తుంటాయి. ఈ ఘటనలపై దర్యాప్తు జరిగాక, గల్లంతైన ఆయా పర్యాటకులు చనిపోయినట్టే చాలావరకు తేలుతుంటుంది. ఈ తరహా చేదు అనుభవాల నుంచి ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. ఇంతకీ పర్వతాలపైనే పర్యాటకులు ఎందుకు తప్పిపోతారు ? వాటిపై ఉన్నప్పుడు టూరిస్టులు చేసే తప్పులేంటి ? ప్రాణాలు పోయేంతగా వాళ్లు ఏం చేస్తున్నారు ? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ఈకథనాన్ని చదవాల్సిందే.
పర్వతాల ప్రయాణంలో సవాళ్ల బాటలు : పర్వతాలపై ప్రయాణం అంటే ఆషామాషీ విషయం కాదు. పర్వతాలు దూరం నుంచి చూడటానికి ఎంత అందంగా కనిపిస్తాయో, వాటిపై ప్రయాణం అంత కఠినంగా ఉంటుంది. ఈక్రమంలో చిన్నపాటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పర్వతాలపై ఉండే ప్రతికూల పరిస్థితుల వల్లే టూరిస్టులకు ఇలాంటి కఠిన సవాళ్లు ఎదురవుతాయి. పర్వతాల మార్గంలో ట్రెక్కింగ్ చేస్తే ఇంకా ఎక్కువ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు ప్రాణాలపైకి కూడా రావచ్చు. పొరపాటున తప్పుడు మార్గంలోకి అడుగుపెడితేే దారితప్పే అవకాశాలు పెరిగిపోతాయి. పర్వతాలపై అకస్మాత్తుగా వాతావరణం మారిపోతుంది. దీనివల్ల మొత్తం టూర్ ప్లాన్ దెబ్బతినే రిస్క్ ఏర్పడుతుంది. పర్వతాల నుంచి కొండచరియలు విరిగిపడుతుంటాయి. వరదలు, హిమపాతం టైంలో అవి చాలా సులభంగా ప్రభావితం అవుతాయి. ఇలాంటి టైంలో పర్వతాలపై ఉంటే రిస్క్‌లో ఉన్నట్టే.

ఆరోగ్య సమస్యలు, అటవీ జంతువులు ముసురుకునే ముప్పు : పర్వతాలు చాలా ఎత్తులో ఉంటాయి. అందువల్ల వాటిపైకి చేరుకున్నాక వాంతులు, తలతిరగడం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు అంత ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకపోవడమే బెటర్. పర్వతాలపై అటవీ జంతువుల సంచారం ఉంటుంది. వాటి నుంచి కూడా టూరిస్టులకు ముప్పు ఉంటుంది. పర్వత ప్రాంతాలకు దరిదాపుల్లో పెద్దగా ఆస్పత్రులు ఉండవు. అందువల్ల ఆరోగ్య అత్యవసరం ఏర్పడితే చికిత్స చేయించుకోవడం కష్టతరంగా మారుతుంది. పర్వతాలపై మొబైల్ నెట్‌వర్క్ కనెక్ట్ కావడం కూడా చాలా కష్టమే.
పర్వతాలపై పర్యాటకులు చేసే తప్పులేంటి?
పర్వతాల అందాలు పర్యాటకులను వాటి వైపుగా ఆకర్షిస్తాయి. పర్వతాలపైకి చేరుకున్న తర్వాత పలువురు టూరిస్టులు అతివిశ్వాసంతో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తారు. కొందరు ఏమీ ఆలోచించకుండానే మంచుతో ఉన్న పర్వతాలపైకి నేరుగా వెళ్లిపోతుంటారు. ఇంకొందరు దట్టమైన అడవుల్లో అడ్వెంచర్లు చేసేందుకు యత్నిస్తారు. ఇలాంటి కారణాల వల్లే వారి ప్రాణాలపైకి వస్తుంది. సరదాగా, షికారు కోసం పర్వతాలపైకి వెళ్లే టూరిస్టుల్లో కొంతమంది నిర్లక్ష్యాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించి ట్రెక్కింగ్, అడ్వెంచర్ అంటూ కష్టాల్లో చిక్కుకుంటారు.

ట్రెక్కింగ్‌కు వెళ్లే ముందు ఇవి గుర్తుంచుకోండి
- పర్యాటక, అటవీ విభాగాలు నిర్దేశించిన మార్గంలోనే ట్రెక్కింగ్ చేయండి. ధార్మిక యాత్రల్లోనూ ఈ సూచనను పాటించాలి. అవగాహన లేని మార్గాల్లో వెళ్లకపోవడమే మంచిది.
- గైడ్ సహాయం తీసుకోండి. వారి సూచనల ప్రకారం ప్లాన్ రెడీ చేసుకోండి.
- మీ వివరాలను రిజిస్ట్రేషన్ చేయించండి. మీకు సంబంధించిన సరైన సమాచారాన్నే ఇవ్వండి. దీనివల్ల టూరిస్టు గల్లంతైనా వెంటనే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెడతారు. పర్యాటకుడి సంబంధీకులను అలర్ట్ చేస్తారు.
- ట్రెక్కింగ్, అడ్వెంచర్స్‌కు వెళ్లే వాళ్లు తమ పర్యటన వివరాలను హోటల్ సిబ్బందికి తెలియజేయండి.
- అత్యవసర కిట్‌ను సిద్ధంగా ఉంచుకోండి. అందులో మందులు, టార్చ్, గొడుగు, ప్రథమ చికిత్స సామగ్రి, నీరు, సన్ స్క్రీన్ లోషన్ ఉండాలి.
- వర్షాలు కురుస్తున్నప్పుడు నదీ తీరాలకు, హిమపాతం ఉన్నప్పుడు మంచు పర్వతాలపైకి వెళ్లకండి. వాతావరణం సరిగ్గా లేనప్పుడు పర్వతాలు, అడవుల్లోకి వెళ్లొద్దు.
- పర్వతాలపై ఉన్నా సకాలంలో భోజనం చేయండి. వాతావరణ మార్పు ప్రభావం ఆరోగ్యంపై పడొచ్చు.
అత్యవసరాల్లో కాల్ చేయడానికి అన్ని రకాల ఎమర్జెన్సీ నంబర్లు, అధికార వర్గాల నంబర్లను సిద్ధంగా ఉంచుకోండి.
హనీమూన్ జంట మిస్సింగ్ కేసులో ట్విస్ట్- భర్తను చంపించింది భార్యే!
ఊటీకి వెళ్తున్నారా? పర్యాటకులపై ఆంక్షలు, టూరిస్ట్ స్పాట్ మూసివేత- కారణం ఇదే