Rahul Gandhi Herald Case : నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సంచలన ఆరోపణలు చేసింది. వారు రూ.142కోట్లు లబ్ధి పొందారని పేర్కొంది. ఆ ఆదాయాన్ని వాళ్లు ఉపయోగించుకున్నట్లు తెలిపింది. దిల్లీ ప్రత్యేక కోర్టులో బుధవారం జరిగిన విచారణ సందర్భంగా వాదనలు వినిపించిన ఈడీ ఈ మేరకు ఆరోపణలు చేసింది.
విదేశీ నిధులతో నేషనల్ హెరాల్డ్ పత్రికను పెంచి పోషించారనే ఫిర్యాదు మేరకు ఈడీ, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. సీబీఐ విచారణ మధ్యలో నిలిచిపోయినప్పటికీ, ఈడీ దర్యాప్తు మాత్రం సాగుతోంది. 2023 నవంబరులో జప్తుచేసిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ.751.9కోట్ల ఆస్తుల స్వాధీనానికి ఈడీ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. అద్దెకు ఉంటున్నవారు ఇకపై తమకే ఆ మొత్తం చెల్లించాలని తెలిపింది. అక్రమ చెలామణి నిరోధక చట్టం ప్రకారం జప్తు చేసిన ఆస్తులను స్వాధీనం చేసుకొనే ప్రక్రియ చేస్తున్నామని తెలిపిన ఈడీ దిల్లీ, ముంబయి, లఖ్‌నవూలోని భవనాలకు నోటీసులు అంటించింది.
ఏంటీ కేసు?
నేషనల్ హెరాల్డ్ అనేది 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన చారిత్రక వార్తాపత్రిక. ఈ పత్రికలో అవకతవకలు జరిగాయంటూ 2012లో బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి పటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) సంస్థలో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ఏజెఎల్ సంస్థకు చెందిన రూ.2000 విలువైన స్థలాలను కేవలం రూ.50 లక్షలకే దక్కించుకున్నట్లు అభిమోగాలు మోపింది. వైఐఎల్‌లో రాహుల్‌కు 38శాతం, సోనియాకు 38శాతం షేర్లు ఉన్నాయి. ఏజేఎల్‌కు చెందిన 99 శాతం షేర్లను యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు బదిలీ చేశారు. ఈ లావాదేవీ మనీలాండరింగ్‌లో భాగమన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఈడీ 2021 నుంచి అధికారికంగా దర్యాప్తును ప్రారంభించింది. 2025 ఏప్రిల్ 9న మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్లు 3 మరియు 4 కింద చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సోనియా గాంధీని ఏ1గా, రాహుల్ గాంధీని ఏ2గా ఈడీ చేర్చింది. కాంగ్రెస్ నాయకులు సామ్ పిట్రోడా, సుమన్ దూబే వంటి వారు కూడా నిందితులుగా ఉన్నారు.