SC Slaps 50k Fine On UP Cops : ఓ సివిల్ వివాదంపై క్రిమినల్ కేసు బుక్ చేసిన ఇద్దరు ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారులకు సుప్రీంకోర్ట్ రూ.50,000 జరిమానా విధించింది. ఆస్తులకు సంబంధించిన వివాదాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సివిల్ వివాదాలపై ఎఫ్‌ఐఆర్ నమోదును సవాల్ చేస్తూ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్లు వెల్లువెత్తుతున్నాయని, ఈ ఆచారం 'న్యాయస్థానాలు ఇచ్చిన అనేక తీర్పులను ఉల్లంఘించడం' కిందకే వస్తుందని పేర్కొంది. "సివిల్ వివాదాలపై క్రిమినల్ కేసులు దాఖలు చేయడం ఆమోదయోగ్యం కాదు" అని సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
వారి బదులు మీరు జరిమానా కట్టండి!
అయితే ఈ కేసులో పోలీసు అధికారులపై విధించిన జరిమానాను మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్ట్ ధర్మాసనాన్ని కోరారు. కానీ సర్వోన్నత న్యాయస్థానం ఈ జరిమానాను మాఫీ చేయడానికి నిరాకరించింది.
"మీరు రూ.50,000 జరిమానా చెల్లించండి. తరువాత ఆ ఇద్దరు పోలీసు అధికారుల నుంచి ఆ డబ్బులను వసూలు చేసుకోండి" అని సుప్రీం ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది.
ఇంతకీ ఆ కేసు ఏమిటి?
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన రిఖాబ్ బిరానీ, సాధన బిరానీ తమకు ఉన్న ఓ గిడ్డంగిని శిల్పి గుప్తా అనే ఆమెకు రూ.1.35 కోట్లకు విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో శిల్పి గుప్తా అడ్వాన్స్ కింద రూ.19 లక్షలు చెల్లించారు. మరో 25 శాతం మొత్తాన్ని 2020 సెప్టెంబర్ 15లోపు ఇస్తామన్నారు. కానీ ఆ గడువులోగా ఆ డబ్బు చెల్లించలేకపోయారు. దీనితో బిరానీలు ఆ గిడ్డంగిని మరో వ్యక్తికి రూ.90 లక్షలకు విక్రయించారు. కానీ శిల్పి గుప్త చెల్లించిన రూ.19 లక్షలను తిరిగి ఇవ్వలేదు. దీనితో ఆమె బిరానీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని క్రిమినల్ కోర్ట్‌ను ఆశ్రయించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. ఇది సివిల్ కేసు కనుక క్రిమినల్ కేసుగా పరిగణించి దర్యాప్తు చేయమని ఆదేశించలేమని స్థానిక కోర్ట్ తెలిపింది.
అయితే స్థానిక పోలీసులు మాత్రం మోసం, క్రిమినల్ బెదిరింపులు లాంటి నేరాలను మోపుతూ బిరానీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐర్‌ను రద్దు చేయడానికి అలహాబాద్ హైకోర్ట్ నిరాకరించింది. బిరానీలు విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. దీనితో వారు సుప్రీంకోర్ట్‌ను ఆశ్రయించారు.
తాజాగా దీనిని విచారించిన సుప్రీంకోర్ట్, 'శిల్పి గుప్తా వేసిన రెండు వేర్వేరు పిటిషన్లను స్థానిక మెజిస్టీరియల్ కోర్ట్ రెండు సార్లు తిరస్కరించినా, రాష్ట్ర పోలీసులే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని అగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు "యూపీలో చట్టబద్ధమైన పాలన పూర్తిగా దెబ్బతింది. సివిల్ అంశాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం ఆమోదయోగ్యం కాదు" అని వ్యాఖ్యానించింది. అంతేకాదు ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ డైరెక్టరేట్ జనరల్‌ను ఆదేశించింది.
భాషకు మతం లేదు!
నేమ్ బోర్డ్‌ల్లో ఉర్దూ భాష ఉపయోగించడానికి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. 'భాష అనేది మతం కాదని' వ్యాఖ్యానించింది.
మహారాష్ట్ర, అకోలా జిల్లా, పాటూరు మాజీ కౌన్సిలర్ వర్షతాయ్ సంజయ్ బగాడే- మున్సిపల్ కౌన్సిల్ పరిధిలోని నేమ్ బోర్డ్‌లపై మరాఠీతోపాటు ఉర్దూ భాషను ఉపయోగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అధికారిక కార్యకలాపాలు అన్నీ మరాఠీలోనే జరగాలని, ఉర్దూ వాడకాన్ని అనుమతించకూడదని అందులో పేర్కొన్నారు.
ఇంతకు ముందు అమె చేసిన ఈ అభ్యర్థనను మున్సిపల్ కౌన్సిల్ తిరస్కరించింది. దీనితో ఆమె బాంబే హైకోర్టులో పిటిషన్ వేయగా, అక్కడా కూడా ఆమెకు అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై జస్టిస్ సుధాంశ్ ధులియా, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. "భాష అనేది ఒక సమాజానికి, ప్రాంతానికి, ప్రజలకు చెందినది. భాష ఒక మతానికి చెందినది కాదు. భాష అనేది ఒక సంస్కృతి. సమాజం, ప్రజల నాగరికత పురోగతిని కొలవడానికి ఇది ఒక కొలమానం. ఉర్దూ భాష విషయంలోనూ అంతే" అని పేర్కొంది.
"స్థానికులకు అర్థం అయ్యే భాష కనుకనే, మున్సిపల్ కౌన్సిల్ ఉర్దూను నేమ్ బోర్డ్‌ల్లో ఉంచింది. 2022 చట్టం సహా ఇతర ఏ చట్టంలోని నిబంధనల్లోనూ ఉర్దూ వాడకంపై నిషేధం లేదు. హైకోర్ట్ ఇచ్చిన తీర్పుతో మేము ఏకీభవిస్తున్నాం' అని చెప్పి సుప్రీంకోర్ట్ ఈ పిటిషన్‌ను కొట్టేసింది.
హిందూ ట్రస్టుల్లో ముస్లింలను నియమిస్తారా?- 'వక్ఫ్' కేసు విచారణలో సుప్రీంకోర్టు
పాపాలను కప్పిపుచ్చడానికే గాంధీ కుటుంబంపై 'ఈడీ' వేధింపులు : కాంగ్రెస్ చీఫ్ ఖర్గే