ETV Bharat / bharat

పోలీసుల వినూత్న ఆలోచన- రోజుకు 6.5లక్షల లీటర్ల నీరు రీసైక్లింగ్- ఆ వాటర్​తో మినీ ఫారెస్ట్ ఏర్పాటు!

రోజుకు 6.5 లక్షల లీటర్ల నీరు రీసైక్లింగ్- అదే నీరు అవసరాలకు వాడకం- ఫరీదాబాద్ పోలీసుల మంచి ఆలోచన

Faridabad Police Water Recycling
Faridabad Police Water Recycling (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : June 29, 2025 at 12:29 AM IST

4 Min Read
Choose ETV Bharat

Faridabad Police Water Recycling : హరియాణాలోని ఫరీదాబాద్ పోలీసులు నీరు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రోజూ 6.5 లక్షల లీటర్ల నీటిని ఆదా చేస్తున్నారు. ఈ నీటితో ఒక చిన్న అడవిని సృష్టించారు. ఇలా తమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫరీదాబాద్ పోలీసులు నీటి పొదుపు, రీస్లైకింగ్ నీటి వినియోగంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

రోజుకు 6.5 లక్షల లీటర్ల నీరు రీసైక్లింగ్
హరియాణాలోని పలు ప్రాంతాల ప్రజలు నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అయితే ఫరీదాబాద్ లోని సెక్టార్ 30లో పోలీస్ లైన్ ఉంది. ఇక్కడ ఉన్న పోలీస్ హౌసింగ్ డిపార్ట్​మెంట్ ప్రతిరోజూ 6.5 లక్షల లీటర్ల నీటిని రీసైక్లింగ్ చేసి తిరిగి ఉపయోగిస్తోంది. అందుకోసం మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ ను ఏర్పాటు చేశారు. వర్షపు నీరు అయినా లేదా పోలీస్ లైన్​లో ఉన్న ఫ్లాట్​ల నుంచి వచ్చే జలాలనైనా రీసైకిల్ చేసి మొత్తం ఆ ప్రాంత ప్రజలకు సరఫరా చేస్తారు. ఇది మాత్రమే కాకుండా, నీరు రీసైక్లింగ్ చేసే సమయంలో వచ్చే వ్యర్థాల నుంచి ఎరువులు తయారు చేస్తున్నారు.

మినీ ఫారెస్ట్ ఏర్పాటు
అలాగే ఈ నీటిని 48 ఎకరాల్లో విస్తరించి ఉన్న పోలీస్ లైన్ లోపల ఉన్న చెట్లు, మొక్కలపై స్ప్రే చేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్​ను ఈ జలాలతోనే తడుపుతున్నారు. ఈ నీటిని ఉపయోగించి పోలీస్ లైన్ లోపల ఒక మినీ ఫారెస్ట్ లా మొక్కలను పెంచారు. అవి పచ్చదనంతో కలకల్లాడుతున్నాయి. అందుకే దాన్ని వారు ముద్దుగా 'హోలీ ఫారెస్ట్' అని పిలుచుకుంటారు.

'మురుగు నీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు'
"మేం ఈ ప్రణాళికను ఆరేడేళ్లు క్రితం ప్రారంభించాం. ఇక్కడ ఒక మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను ఏర్పాటు చేశాం. దీని ద్వారా మేము వర్షపు నీటిని, పోలీస్ లైన్ లోపల ఉపయోగించిన నీటిని రీసైకిల్ చేసి మళ్లీ వాడుతాం. పోలీస్ లైన్ లోపల 800కి పైగా ఫ్లాట్లు ఉన్నాయి. ఇవి కాకుండా సీఐడీ, క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్సిక్ కార్యాలయాలు ఉన్నాయి. మేము అందరూ ఉపయోగించిన నీటిని పైపుల ద్వారా సేకరించి మురుగు నీరు శుద్ధి ప్లాంట్ కు తరలించి రీసైకిల్ చేస్తాం. ఇది మాత్రమే కాదు. పోలీస్ లైన్ చుట్టూ అనేక సెక్టార్​లు ఉన్నాయి. వర్షాకాలంలో ఆ సెక్టార్​ల నుంచి వచ్చే నీరు నేరుగా మా పోలీస్ లైన్ లోపల నిర్మించిన మురుగునీటి శుద్ధి ప్లాంట్​కు చేరుకుంటుంది, దీని కోసం మేము పైప్‌ లైన్ ను ఏర్పాటు చేశాం. వర్షపు నీటిని నిల్వ చేస్తాం. చెట్లు, మొక్కలకు నీరు పెట్టడానికి మేము ఈ రీసైకిల్ చేసిన నీటిని ఉపయోగిస్తాం. 48 ఎకరాలలో విస్తరించి ఉన్న పోలీస్ లైన్ చుట్టూ పచ్చదనం ఈ నీటి వల్లే ఉంది. ఇక్కడ పండ్ల చెట్లతో పాటు పూల మొక్కలు కూడా ఉన్నాయి" అని ఫరీదాబాద్ పోలీస్ హౌసింగ్‌ కు చెందిన ఎస్డీఓ షంషేర్ సింగ్‌ ఈటీవీ భారత్ కు తెలిపారు.

అలాగే పోలీస్ లైన్ లోపల చాలా చెట్లు ఉన్నాయని షంషేర్ సింగ్ పేర్కొన్నారు. దీన్ని హెలీ ఫారెస్ట్ అంటామన్నారు. ఫరీదాబాద్​లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని, కానీ లోపల ఉన్న చెట్లు ఉష్ణోగ్రతను తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. పోలీస్ లైన్ చుట్టూ ఉన్న ప్రజలకు ఈ అడవే తగినంత ఆక్సిజన్ అందిస్తుందన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్​ను నిర్వహించడానికి తాము అనేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పోలీస్ లైన్ లోపల ఉన్న ఫ్లాట్లు, కార్యాలయాల నుంచి మురుగునీటి శుద్ధి కర్మాగారానికి పైప్‌ లైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పైప్ లైన్ ద్వారా ఉపయోగించిన నీరు నేరుగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ లో చేరుతుందన్నారు. అంతేకాకుండా వర్షాకాలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని మురుగునీరు పైప్‌ లైన్ ద్వారా ప్లాంట్ కు వస్తుందని చెప్పారు. దాన్ని కలెక్షన్ ట్యాంక్ అని పిలుస్తారన్నారు.

'దశలవారీగా నీరు శుద్ది'
"కలెక్షన్ ట్యాంక్ పని నీటిని సేకరించి అందులో ఉన్న వ్యర్థాలను వేరు చేయడం. ఆ తర్వాత నీరు ఇన్లెట్ బాక్స్​కు వెళుతుంది. అక్కడ మళ్లీ శుద్ధి అవుతుంది. అనంతరం ట్యాంకు కు వెళ్తే, అక్కడ రసాయనాలు కలుపుతారు. ఆ కెమికల్స్ నీటిని దుర్వాసన రాకుండా చేస్తాయి. అలాగే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఆపై నీరు మూవింగ్ బెడ్ బయోఫిల్మ్ రియాక్టర్‌-1కు (ఎంబీబీఆర్) వెళ్తుంది. ఇక్కడ సేంద్రియ పదార్థాలను తొలగిస్తారు. ఆ తర్వాత నీటిని ఎంబీబీఆర్-2లోకి విడుదల చేస్తారు. అక్కడా క్లీనింగ్ అయిన తర్వాత చివరకు నీరు ట్యూబ్ సెటిల్లర్​కు చేరుకుంటుంది. ఆఖరికి ట్యూబ్ సెటిల్లర్ ద్వారా ట్యాంక్‌ లోకి జలాన్ని విడుదల చేస్తారు" అని షంషేర్ సింగ్ తెలిపారు.

నీటి పొదుపుపై ప్రశంసలు
కాగా, ఫరీదాబాద్ పోలీసుల నీటి ఆదాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఫరీదాబాద్ లో ప్రతిచోటా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. ఫరీదాబాద్ పోలీస్ హౌసింగ్ డిపార్ట్‌ మెంట్ నీటి పొదుపును పర్యావరణవేత్తలు సైతం కొనియాడుతున్నారు.