Faridabads Auto Girl Sonali : ఆమె పేరు సోనాలి. వయసు 22 ఏళ్లు. ఆటో నడుపుతూ తన తల్లి, సోదరీమణులను పోషిస్తోంది. సోనాలికి 18 ఏళ్ల వయసు ఉండగా తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి కుటుంబ భారాన్ని తన భుజ స్కంధాలపై మోస్తోంది. ఆమె డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూనే, రోజూ 10 గంటల పాటు ఆటోను నడుపుతోంది. లాయర్ కావాలనేది తన జీవిత లక్ష్యమని చెబుతున్న సోనాలిపై 'ఈటీవీ భారత్' స్ఫూర్తిదాయక కథనమిది.
సరాదాకు తండ్రి నేర్పిన పనే తిండిపెడుతోంది!
సోనాలి, ఆమె కుటుంబీకులంతా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. అయితే ప్రస్తుతం వీరు హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని సెక్టార్ 22లో ఉన్న శివ కాలనీలో నివసిస్తున్నారు. సోనాలి తండ్రి జైప్రకాశ్ ఒక ఆటో డ్రైవర్. ఆయన 2021 సంవత్సరంలో మరణించారు. ఆ సమయానికి కరోనా బాగా వ్యాప్తిలో ఉంది. తండ్రి కాలం చేసిన తర్వాత సోనాలి తల్లి పుష్నా రాణి ఇంట్లోనే కుట్టుపనులు చేశారు. అయితే ఆమెకు అంతగా ఆదాయం రాలేదు. దీంతో కుటుంబం గడవడం కష్టతరంగా మారింది. ఈ కష్టకాలాన్ని సోనాలి సవాల్‌గా తీసుకున్నారు. తండ్రి జైప్రకాశ్ బతికి ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఆయనతో కలిసి ఆటో నడపడాన్ని సోనాలి ప్రాక్టీస్ చేసింది. తాను కూడా తండ్రిలాగే ఆటో నడిపే పనిని చేయాలని ఆమె నిర్ణయించుకుంది. గతంలో సరాదా కోసం తండ్రి నేర్పిన ఆటో డ్రైవింగ్‌తోనే ఇప్పుడు కుటుంబాన్ని సోనాలి పోషిస్తోంది. ఎండను, వానను, చలిని లెక్క చేయకుండా రోజూ దాదాపు 10 గంటల పాటు ఆమె ఆటో నడుపుతున్నారు. తాను సంపాదించే డబ్బులతో అక్క సోనియాను నర్సింగ్ చదివిస్తున్నారు. సోనాలి చెల్లెలు ఈ సంవత్సరమే 10వ తరగతి పాసైంది. సోనాలి కూడా డిగ్రీ ఫైనలియర్‌లో ఉంది. లాయర్ కావాలనేది తన జీవిత లక్ష్యమని ఆమె అంటున్నారు.

అప్పట్లో ఆటో ఎక్కేందుకు భయపడేవారు!
సోనాలి ఆటో డ్రైవింగ్ మొదలుపెట్టిన తొలినాళ్లలో చాలా సమస్యలే ఎదురయ్యాయి. పలువురి నుంచి ఆమె అసభ్యకర వ్యాఖ్యలు వినాల్సి వచ్చింది. ఆటోస్టాండ్ల నిర్వాహకులు సోనాలిని ఇబ్బంది కలిగించేలా మాట్లాడారు. కొన్ని సార్లయితే ఆటోస్టాండ్‌లో ఆమె ఆటోను పెట్టనిచ్చేవారు కాదు. పలుసార్లు పోలీస్ హోంగార్డులు కూడా సోనాలిని ఇబ్బందిపెట్టారు. మహిళా ఆటో డ్రైవర్లకు ఈ ఇక్కట్లన్నీ తప్పవని ఆమె భావించారు. కొందరు ప్రయాణికులు సోనాలి ఆటో ఎక్కేవారు కాదు. ఆమె ఆటో సరిగ్గా నడపదేమో, యాక్సిడెంట్ అవుతుందేమో అని ఆందోళన చెందేవారు. క్రమంగా ప్రయాణికులు ఈ తరహా ఆలోచన నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు సోనాలిని కూడా ఇతర ఆటో డ్రైవర్లలాగే చూస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్- 33వేల మందికిపైగా ఫాలోవర్లు
సోనాలి ఓ వైపు ఆటో నడుపుతూనే, మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారు. ఆమెకు 33వేల మందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఫాలోవర్ల సంఖ్యను మరింత పెంచుకుంటానని సోనాలి అంటున్నారు. సోషల్ మీడియా అంటే తనకు చాలా ఇష్టమని చెబుతున్నారు.
ఇతరుల మాటల్ని పట్టించుకోకుండా ముందుకు సాగండి : సోనాలి, ఆటో డ్రైవర్
"నాలాగే జీవితపు సవాళ్లను ఎదుర్కొంటున్న యువతులు, మహిళలకు నేను చెప్పేది ఒక్కటే. ఈరోజు దుఃఖం ఉంది. రేపు కచ్చితంగా ఆనందం వస్తుంది. మనకు ఓపిక ఉండాలి. దేవుడు కచ్చితంగా మంచి చేస్తాడు. మనల్ని ఎవరూ ప్రోత్సహించరు. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. నా కుటుంబం కోసమే ఆటో నడుపుతున్నాను. ఇతరుల మాటలను పట్టించుకుంటే ఏ పనీ చేయలేం. నేను చాలా మంది మాటలు పడ్డాను. అయినా జీవితంపై ఆశను వదులుకోలేదు. నేరాల గురించి మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు సాగాలి" అని 'ఈటీవీ భారత్'తో సోనాలి చెప్పుకొచ్చారు.
బాల్యవివాహాలపై పోరాటం- మాదకద్రవ్యాల వినియోగంపై గళం- స్వీపర్ హీరా బీబీ స్టోరీ ఇదే!