250 Year Old House : ఆ ఇల్లు చూడటానికి అచ్చం రాజ భవనంలా ఉంటుంది. ఎత్తైన గోడలు, ప్రాచీన నిర్మాణ శైలితో కూడిన ఆ ఇంటి స్వరూపంలో రాజదర్పం తొణికిసలాడుతుంది. దాదాపు 250 ఏళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ భవంతిలో గత 8 తరాలుగా ఒకే కుటుంబం నివసిస్తోంది. ఈ భవనం వెనుక ఒక గొప్ప ఫ్రెండ్‌షిప్ స్టోరీ కూడా దాగి ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ ప్యాలెస్ హౌస్ తమిళనాడులోని తెన్‌కాసి జిల్లా శంకరంకోవిల్ పట్టణం సమీపంలోని మైప్పారై గ్రామంలో ఉంది. దీనిపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనమిది.
ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే
మనిషికి ఆహారం, దుస్తులు, నివాసం చాలా ముఖ్యం. ప్రత్యేకించి సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి లైఫ్ టైమ్ గోల్. మనం నిర్మించుకునే ఇల్లు అద్భుతంగా ఉండాలంటే అంతగా డబ్బును ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మైప్పారై గ్రామంలోని భారీ ప్యాలెస్ హౌస్‌లో ఉంటున్న కాడయ్య కుటుంబానికి అంతగా ఆర్థిక స్థోమత లేదు. అయినా వారికి అంతపెద్ద భవంతి ఎక్కడి నుంచి వచ్చింది ? ఎలా నిర్మించుకున్నారు ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కదూ. వీటికి సమాధానాలు తెలుసుకోవాలంటూ మనం 250 ఏళ్ల కిందటి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లాల్సిందే.

స్నేహానికి విలువ ఇచ్చిన మనసున్న జమీందర్
కాడయ్య వారసుల్లో ఒకడైన తిరుపతి కథనం ప్రకారం-'250 ఏళ్ల క్రితం తెన్‌కాసి జిల్లా పరిధిలో ఇళయరాజ నెండాల్ అనే జమీందార్ ఉండేవాడు. ఆయనకు మా తాతయ్య కాడయ్య ఆప్త మిత్రుడు. అప్పట్లో తాను ఇల్లు కట్టుకుంటున్నానని మా తాతయ్య వెళ్లి జమీందార్‌తో చెప్పారట. దీంతో ఆయన సంతోషపడి, ఇంటి నిర్మాణానికి సాయం చేస్తానని మాట ఇచ్చారట. జమీందార్ మాట ఇవ్వడమే కాదు, తన రాజభవన నిర్మాణం చేసిన కార్మికులనే మా ఇంటి పనుల కోసం పంపారట. మా తాతయ్యతో ఉన్న స్నేహం కోసమే జమీందర్ ఇదంతా చేశారు' అని తిరుపతి 'ఈటీవీ భారత్'కు వివరించారు.

సున్నం, ఆవాలు, గుడ్లతో ఇంటి నిర్మాణం
'మా భవంతి చుట్టూ పెద్ద కోట గోడను కూడా కట్టారు. దానివల్లే మా ఇంటి లుక్‌లో రాజదర్పం యాడ్ అవుతుంది. అప్పట్లో సున్నం, ఆవాలు, గుడ్లు వంటి పదార్థాలు కలిపి చేతితో ఈ ఇంటిని కట్టారు. అందుకే ఇప్పటికీ స్ట్రాంగ్‌గా ఉంది' అని తిరుపతి తెలిపారు. 'చెక్కతో చేసిన శిల్పాలే మా ఇంటి ప్రత్యేకత. సింహం, ఏనుగుల కలయికతో ఉండే యాజీ శిల్పాలతో పాటు చిలుకలు, మేకలు, ఆవుల శిల్పాలు మా ఇంట్లో చెక్కి ఉన్నాయి. తమిళనాడులోని ప్రాచీన దేవాలయాల్లోనూ ఈ తరహా శిల్పాలు మీకు కనిపిస్తాయి' అని తిరుపతి చెప్పుకొచ్చారు.
'మా ఇంటి తలుపులను చాలా పెద్ద కలప దుంగలతో తయారు చేశారు. వాటిలో రాజదర్పం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తలుపుల హ్యాండిల్స్‌ను ఇత్తడితో తయారు చేశారు. ఇంటి నిర్మాణం కోసం అప్పట్లో దాదాపు 50 ఎడ్ల బండ్లలో రాజపాళాయం నుంచి కలపను తీసుకొచ్చారట. మా ఇల్లు వేసవి టైంలోనూ చాలా చల్లగా ఉంటుంది. అస్సలు ఏసీ అవసరమే లేదు. బయట ఎంత ఎండ ఉన్నా మా ఇంట్లో మాత్రం ఏసీలో ఉన్నంత చల్లగా ఉంటుంది' అని తిరుపతి పేర్కొన్నారు.

8 తరాలు- 9 కుటుంబాలు
కాడయ్య వంశీకులు గత 8 తరాలుగా మైప్పారై గ్రామంలో ఉన్న ప్యాలెస్ హౌస్‌లోనే జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవంతిలో కాడయ్య వంశానికి చెందిన మొత్తం 9 కుటుంబాలు ఉంటున్నాయి. ఈ అన్ని కుటుంబాలు కలిసిమెలిసి ఉంటాయి. రోజూ అన్ని కుటుంబాలు కలిసి భోజనం, వంటకాలను తయారు చేసుకుంటాయి. అందరూ కలిసి వాటిని షేర్ చేసుకొని తింటారు.
'ఈటీవీ భారత్'తో మాట్లాడిన తిరుపతి, కాడయ్య వంశంలో 8వ తరానికి చెందిన వాడు. ఈ భవనాన్ని ఇలాగే కాపాడి తమ భావితరాలకు అందిస్తామని తిరుపతి తెలిపారు. అవసరమైతే మరమ్మతులు చేయిస్తామన్నారు. 'మా ఊరికి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా మా ఇంటిని చూడటానికి వస్తారు. మా ఇల్లు ఇంకా చాలా ఏళ్లు నిలిచేలా చేయాలి. అదే మా కోరిక' అని కడయ్య వారసులు ధనలక్ష్మి, విజయలక్ష్మి చెప్పారు.
ఇక ఈ ఇంట్లో ఉంటున్న కాడయ్య బంధువు 95 ఏళ్ల కృష్ణమ్మాళ్‌ను కూడా 'ఈటీవీ భారత్' పలకరించింది. ‘‘ఈ ఇంటిని నిర్మించి 250 సంవత్సరాలు దాటింది. అప్పటి జమీందర్ ఈ ఇంటిని కట్టించాడు' అని ఆమె తెలిపింది.
పైకప్పు లేకుండానే 365 గదులు- 200 ఏళ్ల కిందటి భయానక భవనం- శాపం వల్లే ఇలానట!
మైసూరు ప్యాలెస్‌లో దసరా ఏనుగుల బీభత్సం- వీడియో చూశారా? - Elephants Fight In Mysore Palace